పదేళ్ళ తర్వాత తమిళనాడులో "ఉదయ సూర్యుడు'
తమిళనాడు రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో డీఎంకే గెలుపు లాంఛనమైంది. పదేళ్ల తర్వాత ఆ పార్టీ మళ్లీ అధికారంలోకి రానుంది. ఈ ఎన్నికల్లో పార్టీ విజయం వెనుక డీఎంకే అధినేత స్టాలిన్ కీలక పాత్ర పోషించారు. అన్నీ తానై నడిపించి పార్టీని విజయం వైపు నడిపించారు.
తన తండ్రి ఎం.కరుణానిధి మరణం తర్వాత వారసత్వ పోరును తట్టుకుని డీఎంకే పగ్గాలు చేపట్టిన స్టాలిన్... పార్టీ బలోపేతానికి ఎంతగానో కృషి చేశారు. ఒకవైపు బహిష్కృత నేత, తన అన్న అళగిరి నుంచి ఎప్పటికప్పుడు ఎదురయ్యే తిరుగుబాటును సమర్థంగా ఎదుర్కొంటూ.. మరోవైపు అసమ్మతి నేతలను బుజ్జగిస్తూ పార్టీని ఒక్క తాటిపై నడిపి.. ఈ అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీని విజయపథంలో నడిపించారు.
చిన్నవయస్సు నుంచే ఎంకే స్టాలిన్ పార్టీకి సేవలందిస్తూ వచ్చారు. దీంతో పార్టీలో స్టాలిన్‌కు కరుణానిధి ప్రత్యేక స్థానం కల్పించారు. డీఎంకే పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా కూడా స్టాలిన్‌ను నియమించారు. కానీ మొదట్నుంచి స్టాలిన్ అంటే నచ్చని ఆయన అన్న, కరుణానిధి కుమారుడు అళగిరి ఈ పరిణామాలు రుచించలేదు. దీంతో ఆయనకు వ్యతిరేకంగా పావులు కదిపేవాడు.
అళగిరి వ్యవహారం ప్రతిసారి తలనొప్పిగా మారడంతో ఆయన్ను కరుణానిధి పార్టీ నుంచి బహిష్కరించారు. పార్టీ నుంచి తనను తొలగించినప్పటికీ తన తండ్రికి విధేయుడిగా ఉంటాననే అళగిరి అప్పట్లో ప్రకటించాడు. కానీ తన సోదరుడు స్టాలిన్‌పై ఎప్పుడూ నిప్పులు చెరుగుతూ వుండేవారు.
ఆ కోపంతోనే గత అసెంబ్లీ ఎన్నికల్లో డీఎంకే పార్టీని ఓడించేందుకు ప్రయత్నించారు. దక్షిణ తమిళనాడులో పట్టు ఎక్కువగా ఉన్న అళగిరి.. డీఎంకే పార్టీ నేతలను ఓడించాలని తన అనుచరులకు పిలుపునిచ్చారు. ఆ ఎన్నికల్లో డీఎంకే పార్టీ పరాజయం పాలైంది.
ఇలా ప్రతిసారి స్టాలిన్‌కు అళగిరి అడ్డుపడుతూనే ఉండేవాడు. ఈ క్రమంలో కరుణానిధి మరణం తర్వాత డీఎంకే పార్టీని చేజిక్కించుకోవాలని అళగిరి ప్రయత్నించారు. కానీ పార్టీ నేతల మద్దతు స్టాలిన్‌కు ఉండటంతో 2018లో డీఎంకే పార్టీ పగ్గాలు ఆయనకే దక్కాయి. దీంతో పార్టీలో చీలికలు తెచ్చేందుకు కూడా ప్రయత్నించారు.
పార్టీ సీనియర్లలో అసమ్మతి వర్గాన్ని తనవైపు తిప్పుకునే ప్రయత్నాలు కూడా చేశారు. ఈసారి అసెంబ్లీ ఎన్నికల్లోనూ స్టాలిన్‌ను ఓడించేందుకు అళగిరి ప్రయత్నాలు చేశారు. ఈ ఎన్నికల సమయంలో కొత్త పార్టీ పెట్టేందుకు అళగిరి ప్రయత్నిస్తున్నట్లు ప్రచారం కూడా జరిగింది. తన అనుచరులతో పాటు డీఎంకేలోని అసమ్మతి నేతలు ఈ పార్టీ చేరే అవకాశం ఉందని వార్తలు వచ్చాయి. ఒకానొక సమయంలో అళగిరి బీజేపీలో చేరతారని వార్తలు వచ్చాయి.
స్టాలిన్ ఎప్పటికీ సీఎం కాలేడని.. తన మద్దతుదారులు అది జరగనివ్వరని ఈ అసెంబ్లీ ఎన్నికల ముందు సంచలన వ్యాఖ్యలు చేశారు. అయితే అళగిరి ప్రయత్నాలకు తన రాజకీయ ఎత్తుగడలతో స్టాలిన్ ఎప్పటికప్పుడు చెక్ పెట్టుకొచ్చారు. అటు అన్న నుంచి వచ్చే తిరుగుబాటును ఎదుర్కొంటూ.. పార్టీలోని అసమ్మతివర్గాలను బుజ్జగిస్తూ పార్టీని బలోపేతం చేశారు.
ఈ ఎన్నికల్లో కాంగ్రెస్‌తో పొత్తు విషయంలోనూ స్టాలిన్ చాలా జాగ్రత్తగా వ్యవహరించారు. కాంగ్రెస్ పార్టీ అడిగినన్ని సీట్లు ఇవ్వకపోయినా.. రెండు పార్టీలకు ప్రయోజనం కలిగే విధంగా సీట్లు సర్దుబాటు చేయడంలో స్టాలిన్ కీలకపాత్ర పోషించాడు. చివరికి పార్టీని గెలిపించారు. రాష్ట్ర ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించనున్నారు.