అక్రమాల పుట్ట తవ్వుతున్న కూటమి ప్రభుత్వం: వైసిపి నుంచి భాజపాకి వలసలు?
గత ప్రభుత్వ హయాంలో చోటుచేసుకున్న అక్రమాలు భారీగా వున్నాయనీ, ఏ శాఖను కదిలించినా కోట్లకు కోట్లు నిధులు దారి మళ్లించి బొక్కేశారని ఏపీ అసెంబ్లీలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. మద్యం ద్వారా వచ్చిన ఆదాయం రూ. 14,276 కోట్ల రూపాయలను ఏపీ స్టేట్ డెవల్మెంట్ కార్పోరేషనుకు మళ్లించేసారని విచారణలో గుర్తించినట్లు చెప్పారు.
ఇప్పటికే రాష్ట్ర పౌర సరఫరాల శాఖామంత్రి కాకినాడలో భారీఎత్తున అక్రమ బియ్యం నిల్వలు సీజ్ చేసారు. ద్వారంపూడి చంద్రశేఖర రెడ్డి కనుసన్నల్లో ఈ అక్రమాలు జరిగినట్లు ఆయన అనుమానం వ్యక్తం చేసారు. అలాగే దేవాదాయ శాఖ, రెవిన్యూ శాఖ ఇలా అన్ని శాఖల్లోనూ భారీ అవినీతి జరిగిందనీ, దాన్ని కప్పిపుచ్చుకునేందుకు మదనపల్లి వంటి కార్యాలయాలకు నిప్పు కూడా పెడుతున్నారంటూ చెప్పారు.
మొత్తమ్మీద అక్రమాలు, అవినీతి క్రమంగా ప్రజల ముందుకు రావడం ఖాయంగా కనిపిస్తుండటంతో వైసిపికి చెందిన కొంతమంది నాయకులు ఇటు తెదేపా అటు జనసేనలోకి కాకుండా జాతీయ పార్టీ భాజపాలోకి వెళ్లాలని ప్రయత్నిస్తున్నారట. అందుకోసం ఇప్పటికే బీజేపి ఎమ్మెల్యేలు విష్ణుకుమార్ రాజు, ఆదినారాయణ రెడ్డిలతో కొంతమంది టచ్ లోకి వచ్చినట్లు సమాచారం. భాజపా అధిష్టానం నుంచి గ్రీన్ సిగ్నల్ వస్తే... ఇక జంపింగే తరువాయి అని కాచుకుని కూర్చున్నారట.