పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.. ఈ పేరులోనే ఏదో కిక్కు ఉంది. ఈయనకు కాస్త తిక్క ఉంది. పైగా, ఈయన నటించే చిత్రాలకు బాక్సాఫీస్ వద్ద ఓ లెక్కుంది. అందుకే... ఓ నటుడిగా సినీ ప్రేక్షకుల గుండెల్లో చెరగమని ముద్రవేసుకున్నారు. అంతేనా... పవన్‌కు ముక్కుసూటితనమెక్కువ. అడ్డంకుల్ని లెక్కచేయనిగుణం పుష్కలం. సహనం సేవానిరతి, సమాజంపట్ల అక్కర టన్నుల్లో వుంది. ఇదే పవన్‌ను అభిమానించే వారికి ఎనలేని ధైర్యాన్ని అందిస్తుంది.
పవన్ కళ్యాణ్ ఓ నటుడిగానే కాకుండా, మానవతావాదిగా కూడా అభిమానులతో పాటు ప్రజల గుండెల్లో చెరగని ముద్రవేసుకున్నారు. అలాంటి పవన్ కళ్యాణ్ 49 యేళ్లు పూర్తి చేసుకుని 50వ యేటలోకి అడుగుపెడుతున్నాడు. ఈ సందర్భంగా ప్రతి ఒక్కరు పవన్‌కు ప్రత్యేక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.
డాక్టర్‌ని కాబోయి యాక్టర్‌ని అయ్యానని చాలా మంది అంటుంటారు. కాని పవన్ డాక్టర్ కావాలనుకోలేదు, యాక్టర్ కావాలనుకోలేదు. ఏదో సాదాసీదాగా జీవితాన్ని కొనసాగించాలని భావించాడు. కానీ మెగాస్టార్ చిరంజీవి ప్రోద్భలంతో సినిమాలలోకి ఎంట్రీ ఇచ్చాడు. ఆపై పవన్ ఓ బుల్లెట్‌లా దూసుకెళుతున్నాడు. హిట్స్, ఫ్లాప్స్‌తో సంబంధం లేకుండా ఆయన నట ప్రస్థానం అప్రతిహతంగా సాగింది. ఇప్పటికీ సాగుతోంది.
రాజకీయాల్లోకి అడుగుపెట్టడంతో రెండేళ్ళ విరామం వచ్చింది. ఇటీవలే రీ ఎంట్రీ ఇచ్చారు. అయినా.. ఇమేజ్ ఏమాత్రం చెక్కుచెదరలేదు. పైగా, పవన్ సినిమాల కోసం ఆయన అభిమానులు కళ్ళల్లో ఒత్తులు వేసుకొని మరీ ఎదురు చూస్తున్నారు. దటీజ్ పవన్ కళ్యాణ్.
నటుడు అంటే కొంత వరకే అభిమానం ఉంటుంది. కానీ అభిమానులు ఆయనని దేవుడి కన్నా ఎక్కువగా కొలవడాన్ని చూసి అందరు ఆశ్చర్యపోతుంటారు. ఒక్క అభిమానులేం ఖర్మ.. చివరకు నిర్మాత బండ్ల గణేష్, డైరెక్టర్ హరీష్ శంకర్, హీరోలు నితిన్, సంపూర్ణేష్ బాబు వంటివారు కూడా పవన్‌ను ఓ దేవుడిగా భావించి కొలుస్తారు. పవన్ తన సినీ ప్రస్థానంలో నటించింది కేవలం 26 చిత్రాలే. కానీ, కోట్లాది మంది అభిమానుల గుండెల్లో చెరగని ముద్రవేసుకున్నాడు.
అంతేకాదండోయ్... మానవ సేవే మాధవ సేవ అని సిద్ధాంతాన్ని తన ఊపిరిగా చేసుకుని ముందుకు సాగిపోతున్నాడు. అందుకే పవన్ చేతికి ఎముకే లేదని అనేక సినీ ప్రముఖులే అంటుంటారు. రూ.కోట్లలో పారితోషికం తీసుకునే ఈ రోజుల్లో నిర్మాత బండ్ల గణేష్‌కు ఏకంగా గబ్బర్ సింగ్ అనే చిత్రాన్ని ఏకంగా ఊచితంగా చేసిపెట్టాడంటే.. పీకేలోని ఉదారగుణం ఎలాంటిదో ఇట్టే చెప్పొచ్చు.
సినిమాల్లో ఒక నటుడిగా, రాజకీయాల్లో జనసేన అధినేతగా ముందుకు సాగుతున్న పవన్ .. 'నేనెప్పుడు ట్రెండ్ ఫాలో కాను, సెట్ చేస్తా' అని అంటారు. తన సినిమాలతో ఎందరికో లైఫ్ ఇచ్చిన పవన్ అభిమానులకే కాదు కొందరు సెలబ్రిటీలకు కూడా ఆరాధ్య దైవం.
1996లో వచ్చిన 'అక్కడ అబ్బాయి ఇక్కడ అమ్మాయి' అనే సినిమాతో కెరీర్ మొదలు పెట్టిన పవన్ కళ్యాణ్‌కు "బద్రి" సినిమా మంచి హిట్ ఇచ్చింది. ఇక 'ఖుషి' సినిమాతో పవర్ స్టార్‌గా మారిన ఆయన 'గబ్బర్ సింగ్'తో రెచ్చిపోయారు. ఖుషీకు, గబ్బర్ సింగ్‌కు మధ్య వచ్చిన చిత్రాలన్నీ అంతగా ఆడకపోయిన పవన్ క్రేజ్ ఏ మాత్రం తగ్గలేదు. ఇవాళ పవన్ కొన్ని సినిమాలకు మార్కెట్ వాల్యూ పెంచాడు. ఎన్ని ఫ్లాప్స్ వచ్చిన కూడా పవన్‌తో సినిమా అంటే నిర్మాతలు క్యూలో ఉంటారు.
'అత్తారింటికి దారేది' చిత్రంతో ఇండస్ట్రీ హిట్ కొట్టిన పవన్ కళ్యాణ్ ఆ తర్వాత అంతగా అలరించలేకపోయాడు. అయినప్పటికీ ఇప్పుడు ఆయన చేస్తున్న 'వకీల్ సాబ్' చిత్రం, క్రిష్ దర్శకత్వంలో చేయనున్న 27వ చిత్రం, హరీష్ శంకర్ దర్శకత్వంలో రానున్న 28వ చిత్రంపై అభిమానులలో భారీ అంచనాలే పెట్టుకున్నారు. ఆయన సినిమాలకి మనదేశాంలోనే కాదు ఓవర్సీస్‌లోను భారీ ఆదరణ లభిస్తుంది. వెండితెరపై తన హీరోయిజంతో ఎంతో మందిని ఆకట్టుకున్న పవన్ రియల్ లైఫ్‌లో మాత్రం చాలా సింపుల్‌గా ఉంటారనేది అందరికి తెలిసిన సత్యం.
ప్రజలకు సేవ చేయాలనే ఉద్ధేశంతో జనసేన అనే పార్టీని స్థాపించారు. గత ఏడాది ఎన్నికలలో పవన్ రెండు చోట్లు పోటీ చేయగా, ఆ రెండు స్థానాలలో ఓటమి పాలయ్యారు. అయినప్పటికి అదరలేదు, బెదరలేదు, తొణకలేదు. నిండు కుండలా మళ్లీ నిలబడ్డాడు. విజయమే లక్ష్యంగా ముందుకు సాగుదాం అంటూ తనని నమ్మిన జనసైనికులకి కొండంత ధైర్యాన్ని అందించారు.
ఈ రోజు పవన్ బర్త్‌డే సందర్భంగా ఆయన అభిమానులు, జనసైనికులు దేశ విదేశాలలో అనేక సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. తనకి ఇంత ఆదరణ, ప్రేమ దక్కడం పూర్వజన్మ సుకృతం అని వినమ్రయంగా అంటారు ఈ వకీల్ సాబ్. తనకి సంబంధించిన వేడుకలు జరుపుకోవడం కాని, లేదంటే ఏదైన వేడుకలకి హాజరుకావడం కాని పవన్‌కు ఏ మాత్రం నచ్చదు.
సాదాసీదాగా ఉంటూ వస్తున్న పవన్ సెప్టెంబరు రెండో తేదీన తన 50వ బర్త్‌డే వేడుకలకు కూడా దూరంగా ఉంటున్నాడు. కానీ ఆయన అభిమానులు, జనసైనికులు మాత్రం ఘనంగా బర్త్ డే వేడుకలు నిర్వహిస్తున్నారు. ఈ విషయం తెలుసుకున్న పవన్ సంతోషం వ్యక్తం చేస్తూ వారందరికి హృదయ పూర్వక కృతజ్ఞతలు తెలిపారు.