సోమవారం, 25 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరెంట్ అపైర్స్
Written By TJ
Last Modified: సోమవారం, 13 ఆగస్టు 2018 (16:45 IST)

ఇపుడు తిరుమల శ్రీవారి మూలవిరాట్టుకి శక్తిలేదా? అందుకే భక్తుల రద్దీ తగ్గిపోయిందా??

మహాసంప్రోణ సందర్భంగా తిరుమల గిరులు బోసిపోతున్నాయి. నిత్యం భక్తజన గోవిందనామ ఘోషతో కిటకిటలాడే శ్రీవారి సన్నిధి భక్తులు లేక వెలవెల పోతోంది. సంప్రోక్షణ సందర్భంగా దర్శనా సమయాన్ని టిటిడి కుదించడంతో పాటు ఈ సమయంలో స్వామివారి విగ్రహంలో తేజస్సు ఉండదని కొందరు భ

మహాసంప్రోణ సందర్భంగా తిరుమల గిరులు బోసిపోతున్నాయి. నిత్యం భక్తజన గోవిందనామ ఘోషతో కిటకిటలాడే శ్రీవారి సన్నిధి భక్తులు లేక వెలవెల పోతోంది. సంప్రోక్షణ సందర్భంగా దర్శనా సమయాన్ని టిటిడి కుదించడంతో పాటు ఈ సమయంలో స్వామివారి విగ్రహంలో తేజస్సు ఉండదని కొందరు భావించడంతో తిరుమల ప్రయాణాన్ని వాయిదా వేసుకుంటున్నారు భక్తులు. తిరుమల గిరుల్లో ప్రస్తుత పరిస్థితి ఏంటి.. ఎంతమంది భక్తులున్నారు. ఎంత సమయంలో స్వామివారి దర్శనభాగ్యం లభిస్తోంది... ఈ విషయాలను చూద్దాం. 
 
పన్నెండేళ్ళకొచ్చే మహాసంప్రోక్షణ సంధర్భంగా భక్తులను నియంత్రించలేమని భావించిన టిటిడి తొలుత దర్శనాలను పూర్తిగా రద్దు చేసింది. అయితే ఈ నిర్ణయంపై సర్వత్రా విమర్శలు రావడంతో వెనక్కి తగ్గి భక్తులకు పరిమిత సంఖ్యలో దర్శనమయ్యేలా ఏర్పాట్లు చేశారు అధికారులు. ఎక్కడా భారీగా వారాంతంతో పాటు ఆగస్టు 15 స్వాతంత్ర్య దినోత్సవం వంటి వరుస సెలవులు ఉండటంతో ఎక్కడ భక్తులు భారీగా వచ్చిపడతారో.. వారికి వసతి, దర్శన ఏర్పాట్లు చేయలేక ఎలాంటి ఇబ్బంది పడాల్సి వస్తుందేమోనని భావించిన టిటిడికి ప్రస్తుతం రద్దీ లేకపోవడంతో ఊపిరి పీల్చుకుంది. 
 
మీడియా ద్వారా సంప్రోక్షణ సమయంలో దర్శనాల కుదింపు అంశాన్ని విస్తృతంగా ప్రచారం చేయడంతో భక్తులు తిరుమల ప్రయాణాన్ని వాయిదా వేసుకుంటున్నారు. ఈ సమయంలో తిరుమలకు వెళితే ఎక్కడ ఇబ్బందులు పడాల్సి వస్తుందేమోనని కొందరు, సంప్రోక్షణ సమయంలో స్వామివారి మూలవిరాట్టులో శక్తి ఉండదని మరికొందరు ఇలా ఎవరి కారణాలతో వారు తిరుమలకు రావడంలేదు. దీంతో నిత్యం లక్షలాది భక్తులతో కిటకిటలాడే తిరుమల ప్రస్తుతం బోసిపోయి కనిపిస్తోంది.
 
సంప్రోక్షణకు తోడు సర్వదర్శనం మినహా అన్ని రకాల ప్రత్యేక దర్శనాలను రద్దు చేసింది టిటిడి. కాలి నడకన వచ్చే వారు కూడా సర్వదర్శనం క్యూలైన్లలో వెళ్ళాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇక ఆన్‌లైన్, విఐపి బ్రేక్, ఇతర అన్ని రకాల ఆర్జిత సేవలను రద్దు చేసింది టిటిడి. దీంతో ఎవరు తిరుమల వెళ్ళినా ఉచిత దర్సన లైనులోనే దర్శించుకోవాల్సిన పరిస్థితి ఉంది. అందుకే విఐపిల తాకిడి పూర్తిగా తగ్గిపోయింది.
 
ముందుగా ప్రయాణం ఖరారు చేసుకున్న భక్తులు ప్రస్తుతం తిరుమలలో సులభంగా దర్శనం కావడంపై సంబరపడిపోతున్నారు. సంప్రోక్షణ సమయంలో వచ్చామని, ఎలాంటి ఇబ్బందులు ఎదురవుతాయేమోనని భయపడ్డామని, అయితే ఇంత ఈజీగా దర్శనం అయిపోతుండడం సంతోషంగా ఉందంటున్నారు భక్తులు. కేవలం గంటలోపే దర్సనం పూర్తయిపోతుండడంపై సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అలాగే గంటల తరబడి ఎదురుచూసినా దొరకని వసతి గదులు ఎన్ని కావాలంటే అన్ని దొరుకుతుండటంతో వసతి ఇబ్బందులు తగ్గినట్లయ్యింది. ఇక తలనీలాలు దగ్గర, అన్నప్రసాద కేంద్రం దగ్గర భక్తుల తాకిడి పూర్తిగా తగ్గిపోవడంతో సులభంగా తమ పని పూర్తి చేసుకుంటున్నారు భక్తులు. తాము తిరుమలకు వచ్చామా లేక ఏ ఇతర సాధారణ క్షేత్రానికి వచ్చామా అన్న అనుమానం వచ్చేలా తిరుమలలో తాజా పరిస్థితి ఉందంటున్నారు. 
 
అయితే తిరుమలలో రద్దీ తగ్గడానికి రెండు ప్రధాన కారణాలు కనిపిస్తున్నాయి. ఒకటి టిటిడి సంప్రోక్షణ సమయంలో తొలుత భక్తులకు దర్శనం రద్దు చేయడం తీవ్ర వివాదాస్పదంగా మారింది. సోషల్ మీడియాలో గుడిని మూసేస్తున్నారంటూ పుకార్లు కూడా పెద్ద ఎత్తున రేగాయి. అలాగే సంప్రోక్షణ సమయంలో వస్తే పరిమిత సంఖ్యలోనే దర్శనానికి అనుమతిస్తామని టిటిడి తరువాత చెప్పడంతో ఎందుకొచ్చిన గొడవ... తిరుమల వెళ్లి ఎక్కడ కష్టాలు పడాల్సి వస్తుందేమోనని ప్రయాణం రద్దు చేసుకున్నారు కొంతమంది భక్తులు. తిరుమలకు వచ్చినా దర్శన విషయంపై టిటిడి హామీ ఇవ్వకపోవడం కూడా మరో ప్రధాన కారణం. 
 
రెండవ కారణం చూస్తే సంప్రోక్షణ సందర్భంగా స్వామివారి శక్తిని కలశంలోకి ఆవాహన చేసి ఆ కుంభాన్ని యాగశాలలో ఉంచుతారు. ఆ కలశాన్నే స్వామివారుగా భావించి నిత్యపూజలు, సేవలు చేస్తారు. దీంతో స్వామివారిలో శక్తి ఉండదేమోనని, ఈ సమయంలో దర్శించి మ్రొక్కులు తీర్చుకున్నా ఫలితం రాదేమోనన్న అనుమానం కూడా భక్తుల్లో ఉంది. కనుక సంప్రోక్షణ సమయంలో దర్శనం చాలామంది వాయిదా వేసుకుంటున్నారు. అయితే తిరుమలలో స్వామివారు స్వయంభుగా వెలిసి ఉండడంతో స్వామివారిలో తేజస్సు తగ్గడం అంటూ ఏమీ ఉండదని, ప్రతిష్టించిన విగ్రహాలకు మాత్రమే ఆ పరిస్థితి ఉంటుందని పండితులు చెబుతున్నా చాలామంది భక్తుల్లో అనుమానాలు మాత్రం పోలేదు. దీంతో ఈ సమయంలో తిరుమలకు రాకూడదన్నవారు చాలామందే ఉన్నారు. ఈ రెండు ప్రధాన కారణాలతో తిరుమలకు భక్తులు రాకపోవడంతో ప్రస్తుతం సప్తగిరులు వెలవెలబోతున్నాయి. 
 
గత పన్నెండేళ్ళలో తిరుమలలో ఇంతటి తక్కువ రద్దీ ఎప్పుడు చూడలేదన్న భావన భక్తుల్లో నెలకొంటోంది. 15 నిమిషాల్లో శ్రీవారి దర్శనం పూర్తిచేసుకుంటుండటంతో భక్తుల ఆనందానికి అవధుల్లేకుండా పోతున్నాయి. భక్తుల సంఖ్య తగ్గిన ప్రభావంతో తిరుమల శ్రీవారి హుండీపైన పడుతోంది. రోజుకు 30 వేల మంది భక్తులకు మాత్రమే దర్శనం ఉండటంతో రోజుకి 3 కోట్లు ఉండే హుండీ ఆదాయం కాస్తా సగానికి పైగా పడిపోయిన పరిస్థితి తలెత్తింది. ప్రస్తుతం కోటిన్నర కంటే తక్కువగా హుండీ ఆదాయం కనిపిస్తోంది. అయితే శని, ఆదివారాల్లోనే హుండీ ఆదాయం ఇలా ఉంటే ఇక సోమ, మంగళ, బుధవారాల్లో హుండీ ఆదాయం మరింత తగ్గవచ్చని టిటిడి భావిస్తోంది. తిరుమలలో షాపులన్నింటినీ పూర్తిగా మూసివేశారు. బస్సులను కూడా పరిమిత సంఖ్యలోనే నడుపుతున్నారు. తిరుమల ఘాట్ రోడ్డులో తిరిగే బస్సులన్నీ ఖాళీగానే కనిపిస్తున్నాయి. ఒక్కో బస్సులో ఇద్దరు, ముగ్గురు ప్రయాణీకులు తప్ప ఎక్కువమంది కనిపించడం లేదు. తిరుమల చరిత్రలో ఈ స్థాయిలో భక్తుల రద్దీ పడిపోవడం ఇదే ప్రథమమంటున్నారు టిటిడి అధికారులు.