ఆవిధంగా టిటిడి పరువు మాత్రం పోయినట్లయ్యింది... (Video)
అనాలోచిత నిర్ణయాలు తీసుకోవడం.. ఆ తరువాత నాలుక కరుచుకుని వెనక్కి తగ్గడం టిటిడి పాలకమండలికి అలవాటుగా మారిపోయింది. తాజాగా మహాసంప్రోక్షణ సమయంలో భక్తులను తిరుమల కొండకు నిషేధిస్తూ టిటిడి బోర్డు తీసుకున్న ని
అనాలోచిత నిర్ణయాలు తీసుకోవడం.. ఆ తరువాత నాలుక కరుచుకుని వెనక్కి తగ్గడం టిటిడి పాలకమండలికి అలవాటుగా మారిపోయింది. తాజాగా మహాసంప్రోక్షణ సమయంలో భక్తులను తిరుమల కొండకు నిషేధిస్తూ టిటిడి బోర్డు తీసుకున్న నిర్ణయం దుమారం రేపింది. అన్ని వర్గాల నుంచి తీవ్ర వ్యతిరేకత రావడంతో సిఎం కల్పించుకోవాల్సి వచ్చింది. ముఖ్యమంత్రి ఆదేశాలతో ఎట్టకేలకు వెనక్కి తగ్గింది టిటిడి.
తిరుమల తిరుపతి దేవస్థానం పాలకమండలి తీసుకుంటున్న నిర్ణయాలన్నీ వివాదాస్పదంగానే మారుతున్నాయి. గతంలో పాలకమండలి లేని సమయంలో ఏకపక్షంగా అధికారులు నిర్ణయాలు తీసుకుంటున్నారని ఆ తరువాత కాలంలో పాలకమండలిని ప్రకటించింది ప్రభుత్వం. అయినా పాత కథే అన్నట్లుగా కొనసాగుతోంది టిటిడి వ్యవహారం. ఏదైనా కొత్త నిర్ణయాన్ని ప్రకటించేటప్పుడు తప్పనిసరిగా టిటిడి బోర్డు దానికి సంబంధించి క్షుణ్ణంగా చర్చించాల్సి ఉంటుంది. అంతేకాకుండా ఆగమ సలహామండలి అభిప్రాయం తీసుకుని ముందుకు వెళ్ళాల్సి ఉంటుంది.
అయితే అవేమీ పాటించకుండా ఇష్టానుసారంగా పాలకమండలి గాని, అధికారులుగాని తీసుకుంటున్న నిర్ణయాలు కొత్త సమస్యలకు దారితీస్తున్నాయి. గోటితో పోయే దాన్ని గొడ్డలి దాకా లాగిన సామెతను గుర్తు చేస్తున్నాయి. తాజాగా మహాసంప్రోక్షణ కార్యక్రమ అంశంలోను టిటిడి పరువు బజారున పడినట్లయ్యింది. ప్రతి 12 యేళ్ళకు ఒకసారి విధిగా మహా సంప్రోక్షణ కార్యక్రమం నిర్వహించాలి. ఆలయంలో జీర్ణోద్థరణతో పాటు అనేక మరమ్మత్తు పనులు ఈ కార్యక్రమంలో నిర్వహిస్తారు. అలాగే స్వామివారి విగ్రహ తేజస్సును కలశంలో ఆవాహన చేసి ఆలయం పక్కనే ఉన్న పుష్కరిణి అంతర్భాగంలోని బాలాలయ విగ్రహాలు వెలికి తీసి వాటిలో నిక్షిప్తం చేస్తారు.
ఐదురోజులు వందలాదిమంది రుత్వికులు, పండితులు, అర్చకుల సమక్షంలో యజ్ఞ, యాగాదులు, శాంతి హోమాలు నిర్వహించి తిరిగి స్వామివారి శక్తిని బాలాలయ విగ్రహం నుంచి మూలవిరాట్టుకు ఆవాహన చేస్తారు. ఇది శ్రీవారి ఆలయం ఏర్పడినప్పటి నుంచి వస్తున్న ప్రక్రియే. అయితే స్వల్ప విరామ సమయంలో పరిమిత సంఖ్యలో భక్తులను ఆ సమయంలో అనుమతిస్తారు. కానీ మహా సంప్రోక్షణకు సంబంధించి టిటిడి బోర్డు తీసుకున్న నిర్ణయం రచ్చరచ్చగా మారింది.
తిరుమల జెఈఓ శ్రీనివాసరాజు సంప్రోక్షణ సమయంలో రోజుకు 25 వేల మంది భక్తులను అనుమతిస్తామని ప్రకటన చేసినా నాలుగు రోజులకే అత్యవసరంగా ఈ అంశంపై టిటిడి బోర్డు సమావేశమైంది. జెఈఓ ప్రకటనను పక్కనబెట్టి అసలు భక్తులకు దర్శనాలే ఉండవంటూ నిర్ణయాన్ని వెలువరించింది. అక్కడవరకే నిర్ణయాలు తీసుకున్నా అంతోఇంతో పరువు నిలిచేది. అలా కాకుండా భక్తులను తొమ్మిదిరోజుల పాటు కొండనే ఎక్కనివ్వమంటూ అలిపిరి, శ్రీవారి మెట్టు మార్గంలోనే ఆపేస్తామంటూ టిటిడి ఛైర్మన్ పుట్టా సుధాకర్ యాదవ్ ప్రకటించిన వింత నిర్ణయం పెద్ద చర్చనే రేపింది.
టిటిడి చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా తొమ్మది రోజుల పాటు భక్తులను తిరుమల కొండ ఎక్కనివ్వమని చెప్పడంతో విమర్శలు రేగాయి. భక్తులను తిరుమలకు రావద్దని చెప్పడానికి పాలకమండలికి అధికారం ఎక్కడ ఉందంటూ ప్రశ్నలు వచ్చాయి. చేతనైతే దర్శనం చేయించడం, లేదంటే భక్తులకు పరిస్థితిని వివరిస్తే ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉండేది. అలా కాకుండా తిరుమలకే రావద్దన్న టిటిడి నిర్ణయంపై మండిపడ్డారు భక్తులు.
శ్రీవారికి మ్రొక్కులు చెల్లించుకునేందుకు వేలాదిగా తిరుమలకు వస్తుంటారు భక్తులు. స్వామివారి దర్శనం కాకపోయినా ఆలయం ముందు అఖిలాండం దగ్గర మ్రొక్కులు తీర్చుకుంటారు. సమీప తీర్థక్షేత్రాలను దర్శించుకుంటారు. టిటిడి తీసుకుంటున్న నిర్ణయంతో భక్తులకు ఆ అవకాశం లేకుండా పోయినట్లయ్యింది. దీంతో టిటిడిపై ఫిర్యాదులు ముఖ్యమంత్రి దాకా వెళ్ళడంతో దిద్దుబాటు చర్యలు ప్రారంభించారు చంద్రబాబు. టిటిడి పాలకమండలిపై అక్షింతలు వేసి వెంటనే నిర్ణయాన్ని ఉపసంహరించుకుని గతంలోలా దర్శనాలు కల్పించాల్సిందిగా ఆదేశించారు.
దీనికితోడు శ్రీవారి ఆలయ మాజీ ప్రధాన అర్చకులు రమణదీక్షితులు కూడా ప్రెస్ మీట్ పెట్టబోతున్నారన్న సమాచారం తెలిసిన టిటిడి అధికారులు హడావిడిగా ఆయన ప్రెస్ మీట్ కంటే గంటముందే మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. తమ నిర్ణయాన్ని ఉపసంహరించుకుంటున్నట్లు, భక్తులకు అవసరాలకు అనుగుణంగా నడుచుకుంటామని టిటిడి ఛైర్మన్‌తో పాటు ఈఓ అనిల్ కుమార్ సింఘాల్ ప్రకటించాల్సి వచ్చింది. దీంతో భక్తులు శాంతించినా టిటిడి పరువు మాత్రం పోయినట్లయ్యింది. ఇప్పటికైనా ఏదైనా నిర్ణయం తీసుకునే ముందు సాధ్యాసాధ్యాలను భక్తులను అభిప్రాయాలను దృష్టిలో ఉంచుకుని నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఈవో ప్రెస్ మీట్... వీడియో...