రుషికొండపై జగన్ జల్సా ప్యాలెస్‌ను ఏపీ ప్రభుత్వం ఏం చేయబోతుంది.. ప్రజలు ఇచ్చే సలహా ఏంటి? (Video)
రాష్ట్రానికే తలమానికంగా ఉండే పర్యాటక ప్రాంతాల్లో విశాఖపట్టణంలోని రుషికొండ ఒకటి. ఈ కొండకు బోడిగుండు కొట్టించిన గత వైకాపా ప్రభుత్వ పాలకులు, నాటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అక్రమంగా, అడ్డగోలుగా, కోర్టులను సైతం తప్పుదారి పట్టించారన్న ఆరోపణల నేపధ్యంలో అత్యంత ఖరీదైన, లగ్జరీ భవనాలను నిర్మించిన వ్యవహారం తాజాగా వెలుగులోకి వచ్చింది. ఈ భవనాల నిర్మాణ సమయంలో అటు వైపు ఏ ఒక్క రాజకీయ నేతను వెళ్ళనీయకుండా పోలీసులను 24 గంటల పాటు కాపాలా పెట్టింది. ఇపుడు రాష్ట్రంలో అధికారం మార్పిడి చోటు చేసుకుంది. వైకాపా ప్రభుత్వం స్థానంలో టీడీపీ ప్రభుత్వం ఏర్పాటైంది. దీంతో రుషికొండలో జగన్ జల్సా ప్యాలెస్ రహస్యాలు బహిర్గతమయ్యాయి. దేశ వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయి. ఈ భవనాల్లోని సౌకర్యాలను చూసి ఏపీ ప్రజలు విస్తుపోతున్నారు.
నిజానికి రాష్ట్ర విభజన తర్వాత గత 2014లో కొత్తగా ఏర్పాటైన టీడీపీ ప్రభుత్వం ప్రజా వేదికను ప్రజల సొమ్ముతో నిర్మించింది. ఇక్కడు ఐదేళ్లపాటు వివిధ రకాలైన ప్రభుత్వ కార్యక్రమాలను నిర్వహించింది. ఆ తర్వాత 2019లో జరిగిన ఎన్నికల్లో వైకాపా ప్రభుత్వం ఏర్పాటైంది. ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేశారు. ఈ ప్రజావేదికలో బ్యూరోక్రాట్లు, ఐపీఎస్ అధికారులతో రెండు రోజుల పాటు సమీక్ష చేశారు. మూడో రోజున ఈ ప్రజావేదికను కూల్చివేశారు. అలా విధ్వంసంతో జగన్ తన పరిపాలను ప్రారంభించారు. విచిత్రమేమిటంటే.. ప్రజావేదికను కూల్చివేసినంత వేగంగా ఈ వేదిక శిథిలలాను తొలగించలేదు. ఇప్పటికీ అలాగే ఉన్నాయి. ఇపుడు ఏర్పడిన కొత్త ప్రభుత్వం కూడా ఈ శిథాలను తొలగించబోమని, జగన్ విధ్వంస పాలనకు సాక్షీనిలయంగా ఉంచుతామని వెల్లడించారు.
ఇంతవరకు బాగానేవుంది. ఇపుడు రుషికొండపై జగన్ సర్కార్ రూ.500 కోట్లకు పైగా ప్రజాధనాన్ని వెచ్చించి అత్యాధునిక సౌకర్యాలతో ఏడు బ్లాకులను నిర్మించింది. ఈ భవంతుల్లో కల్పించిన సౌకర్యాలను చూస్తే ప్రతి ఒక్కరికీ కళ్లు బైర్లుకమ్ముతున్నాయి. రాజప్రాకారాలను తలదన్నేలా ఈ భవనాలను నిర్మించారు. కోస్టల్ జోన్ నిబంధనలు, పర్యావరణ ఆంక్షలను ఉల్లఘించి, కోర్టులను సైతం తప్పుదారి పట్టించి ఈ భవనాలను నిర్మించారనే ఆరోపణలున్నాయి. అయితే, ఇపుడు కొత్త ప్రభుత్వం ఈ భవనాలను ఏపీ ప్రభుత్వం ఏం చేస్తుందన్న దానిపై ప్రజల్లో విస్తృతంగా చర్చ సాగుతుంది. ప్రజలు మాత్రం ఈ భవంతులను ఒక లగ్జరీ హోటల్ (7స్టార్ హోటల్)గా తీర్చిదిద్ది పర్యాటక శాఖకు ఆదాయం వచ్చేలా చేస్తే బాగుంటుందని సలహా ఇస్తున్నారు.
నిజానికి ఈ భవాలను నిర్మించిన ప్రాంతంలో ఏపీ టూరిజంకు చెందిన హరిత రిసార్ట్స్ ఉండేది. దీనిద్వారా యేడాదికి రూ.7 కోట్లు నుంచి రూ.10 కోట్ల మేరకు ఆదాయం వచ్చేది. అలాంటి హరిత రిసార్ట్స్‌ను కూల్చివేసిన జగన్ సర్కారు.. ఈ భవనాలను నిర్మించింది. అదీ కూడా కోట్లాది రూపాయల ప్రజాధనాన్ని వెచ్చించి నిర్మించింది. ఈ భవంతుల్లో ఉన్న మరుగుదొడ్డే ఏకంగా మూడు సెంట్ల విస్తీర్ణంలో ఉన్నదంటే ఇక హాలు, పడక గదులు ఏమేరకు సువిశాలంగా ఉంటాయో అర్థం చేసుకోవచ్చని ప్రజలు వ్యాఖ్యానిస్తున్నారు. అందుకే ఈ భవంతులను కొత్త సర్కారు కూల్చివేయకుండా నక్షత్ర హోటల్‌గా మార్చి, పర్యాటక శాఖకు ఆదాయం వచ్చేలా చూడాలని సలహా ఇస్తున్నారు.