గురువారం, 9 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరెంట్ అపైర్స్
Written By ఐవీఆర్
Last Modified: సోమవారం, 22 మార్చి 2021 (18:19 IST)

జీతం తప్ప జీవితంలేదు, అందుకేనా నాగసాధువులుగా 10 వేల మంది ఇంజనీర్లు, వైద్యులు

ఉత్తమమైన చదువు, ఆ తర్వాత అత్యుత్తమైన ఉద్యోగం, ఆ.. తర్వాత అందమైన భార్య... ఇంకా ఆ తర్వాత అద్భుతమైన కుటుంబం, ఇంకా ఇంకా ఆ తర్వాత అత్యద్భుతమైన వ్యక్తిగా సమాజంలో గుర్తింపు. ఇవండీ ఇపుడు మనిషి... ముఖ్యంగా పురుషుడు ముందున్న సవాళ్లు. ఇదివరకు పిల్లాడు పుడితే... బడికి పంపేవారు. ఆ పిల్లవాడు తనకు ఇష్టమైన సబ్జెక్టును ఎంచుకుని చదువుకుని ఆపై ఆసక్తిని బట్టి వృత్తిని ఎంచుకునేవాడు. అది ఏదైనా కావచ్చు. చెక్క పని దగ్గర్నుంచి నింగి లోకి ఆకాశాన్ని పంపే ఇంజనీరు వరకూ. అదంతా వారివారి నైపుణ్యం ఇష్టంతో నేర్చుకున్నవి. వృత్తిగా ఎంచుకున్నవి.
 
మరి నేడో... ప్రస్తుతం చదువుకునే పిల్లలకు ఆ స్వేచ్ఛ లేదు. ర్యాంకులు సాధించాలి. అందుకోసం అహర్నిశలు నిద్రాహారాలు మానేసైనా అనుకున్నది సాధించాలి. సాధించాక ఊరకనే కూర్చుంటే సరిపోదు. విదేశాల్లో ఉన్నతమైన కొలువుల్లో వెలగాలి. ఆ కొలువు దొరికేవరకూ పోరాటం చేయాలి. చివరికి ఎలాగో పట్టుకుంటే... ఆ కంపెనీల్లో చేసే ఉద్యోగం 24x7లా మారిపోతే.. మనిషే ఓ యంత్రమైపోతే... ఇక అతడికంటూ జీవితంలేదు. జీతం తప్ప.
 
కొత్తలో కొత్తకొత్తగా వున్నప్పటికీ ఆ తర్వాత ఆ జీవితం కాస్తా గానుగెద్దు కంటే హీనంగా మారిపోతుంది. ఫలితం తీవ్రమైన మానసిక ఒత్తిడి. ఏదో కోల్పోయామన్న బాధ. అసలు ఇది కాదు జీవితం అనే వ్యధ. అన్నీ కలిసి నేడు చాలామంది ఉన్నతమైన విద్యావంతులను రకరకాల మార్గాల్లోకి నెడుతోంది. కొందరు ఒత్తిడి తాళలేక ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. మరికొందరు భవబంధాలను వదిలేసి అందరికీ దూరంగా వెళ్లిపోయి సాధువులవుతున్నారు. దీనికి ప్రత్యక్ష ఉదాహరణే.. ఇటీవల కుంభమేళాలో ఏకంగా 10వేల మంది నాగ సాధువులుగా కొత్తగా చేరడం.
 
వీరిలో మన దేశంతో పాటు విదేశీయులు కూడా వున్నారు. సంపన్నులు, బాగా చదువుకున్నవారు, వైద్యులు, ఇంజనీర్లు వుండటం గమనార్హం. వీరంతా ఏదో తమాషాకి ఇక్కడికి వచ్చి సాధువులుగా చేరడంలేదు. పైగా నాగ సాధువులు అంటే... వస్త్రాలను త్యజించాలి. దిగంబరులైపోయాలి. ఎవరి ప్రేమానురాగాలకు పాత్రులుగా వుండకూడదు. కామ, క్రోద, మద, మాత్సర్యాలకు అతీతులవ్వాలి. ఒక్కసారి సన్యాసం స్వీకరించిన తర్వాత సదరు వ్యక్తి తన జీవితాన్ని పూర్తిగా భగవంతుని అంకితం చేయాలి.
 
హిమాలయాలతో పాటు ఇతర పుణ్యక్షేత్రాలు తిరుగుతూ తపస్సు చేసుకుంటూ భిక్షకు వెళ్లి దొరికిన దాన్ని తింటూ, దొరకనట్లయితే పస్తులతో వుంటూ జీవితాన్ని గడపాలి. ఇన్ని కష్టాలు వున్నాయని తెలిసి కూడా వేల మంది ఇలా సన్యాసం స్వీకరిస్తున్నారంటే ఖచ్చితంగా ఆలోచన చేయాల్సిందేనంటున్నారు నిపుణులు. ముఖ్యంగా తీవ్రమైన ఒత్తిడితో కూడుకున్న జీవితం మనిషికి పెనుభారం. కనుక దాన్ని త్యజించాల్సిందే.
 
జీవితంలో ఉన్నతమైన లక్ష్యాలు వుండాల్సిందే కానీ ఆ లక్ష్యాల కోసమే పరుగులు తీస్తూ మనిషి అనేవాడు యంత్రంగా మారకూడదు. అలా మారితే మనిషికి మరబొమ్మకు తేడా లేదు. మరబొమ్మకు మనసు వుండదు కనుక అది పనిచేస్తుంది, మనసున్న మనిషి... ఒత్తిడి హద్దు దాటితే ఏమైపోతాడో చెప్పనలవి కాదు.