శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరెంట్ అపైర్స్
Written By Selvi
Last Updated : బుధవారం, 17 మే 2017 (14:40 IST)

రజనీ అలా అనుకోవడమే చిదంబరంకు తలనొప్పి తెచ్చి పెట్టిందా? బీజేపీ వ్యూహాలు వామ్మో..!?

తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ రాజకీయ ప్రవేశంపై రకరకాల కథనాలొస్తున్నాయి. కేంద్రమంత్రిగా కీలక బాధ్యతలు చేపట్టి, కాంగ్రెస్ పార్టీకి తలలో నాలుకగా వ్యవహరించిన చిదంబరంపైన రజనీకాంత్ ఆశలు పెట్టుకోవడమే ఆయన కొంపమ

తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ రాజకీయ ప్రవేశంపై రకరకాల కథనాలొస్తున్నాయి. కేంద్రమంత్రిగా కీలక బాధ్యతలు చేపట్టి, కాంగ్రెస్ పార్టీకి తలలో నాలుకగా వ్యవహరించిన చిదంబరంపైన రజనీకాంత్ ఆశలు పెట్టుకోవడమే ఆయన కొంపముంచిందని వార్తలొస్తున్నాయి. రాజకీయ అనుభవం లేని కారణంగా చిదంబరం లాంటి సీనియర్ మోస్ట్‌ను వెంటబెట్టుకుని అరంగేట్రం చేయాలని రజనీకాంత్ భావించారని సమాచారం. 
 
ఒకప్పుడు అమ్మ జయలలితకు అన్నీ తానై వ్యవహరించిన చో రామస్వామి సలహాలను పాటించిన రజనీకాంత్.. ప్రస్తుతం ఆయన మరణించడంతో చిదంబరంను పొలిటికల్ మెంటర్‌గా నియమించుకోవాలనుకున్నారట. ఈ విషయాన్ని పసిగట్టిన బీజేపీ హైకమాండ్, చిదంబరం కుటుంబ ఆస్తులపై మెరుపు దాడులకు ఆదేశాలు జారీ చేసిందని వార్తలు వస్తున్నాయి. చిదంబరంని, అతని కొడుకు కార్తీని కేసుల్లో ఇరికించడం ద్వారా రజనీకాంత్‌ను నైతికంగా దెబ్బతీయాలని కమలం ప్లాన్ చేసినట్లు తెలిసింది.
 
అంతేకాకుండా ప్రస్తుత తమిళ రాజకీయాల్లో రజనీకాంత్ అరంగేట్రం చేస్తే తప్పకుండా ఆయనదే విజయం అవుతుందని రాజకీయ విశ్లేషకులు జోస్యం చెప్పడంతో.. కమలం రజనీని దెబ్బతీసేందుకు పావులు కదుపుతున్నట్లు సమాచారం. కమలంలో కలిసిపోవాలని ఆ పార్టీ అధ్యక్షుడు అమిత్ షా రాయబారం పంపినా..ఎన్నెన్ని ఎత్తులు వేసినా రజనీకాంత్ ఆ పార్టీలో చేరేందుకు సుముఖత చూపలేదు. దీంతో బీజేపీ రజనీని టార్గెట్ చేసిందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. 
 
మరోవైపు రజనీకాంత్ రాజకీయాల్లో రావచ్చునని రజనీకాంత్ చెప్పడంతో బీజేపీ నేత సుబ్రహ్మణ్య స్వామి కూడా స్పందించారు. రజనీ రాజకీయ ప్రవేశం ఓ జోక్‌గా కొట్టిపారేశారు. రజనీ రాజకీయాలకు దూరంగా ఉంటేనే మంచిదని ఓ సలహా ఇచ్చేశారు. రజనీకాంత్‌కు స్పష్టమైన సిద్ధాంతంలేదని, గతంలో వేర్వేరు పార్టీలతో కలిశారని గుర్తు చేశారు. ఆయన తరచు నిర్ణయాలు మార్చుకుంటారని స్వామి వ్యాఖ్యానించారు. 
 
రజనీకాంత్ అసలు తమిళుడే కాదని, బెంగళూరు నుంచి వచ్చిన మరాఠీ వ్యక్తని వ్యాఖ్యానించారు. రజనీకాంత్‌కు అభిమానులున్నారంటే వాళ్లు ఆయన సిద్ధాంతాలకు ఆకర్షితులై వచ్చినవాళ్లు కారని, ఓ గుంపులా ఆయనను ఆరాధిస్తున్నారని చెప్పుకొచ్చారు. మరి దీనిపై రజనీ ఫ్యాన్స్ ఏ విధంగా స్పందిస్తారనే వేచి చూడాలి.