ఆదివారం, 24 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరెంట్ అపైర్స్
Written By pnr
Last Updated : బుధవారం, 4 అక్టోబరు 2017 (15:14 IST)

ఆరునూరైనా పాదయాత్రకే జగన్ మొగ్గు.. అధికార పార్టీకి అస్త్రమేనా?

రాష్ట్రంలోని ప్రధానప్రతిపక్షమైన వైకాపా, ఆ పార్టీ అధినేత జగన్ మోహన్ రెడ్డి పరిస్థితి ముందు నుయ్యి.. వెనుక గొయ్యిలా మారింది. ప్రభుత్వ వైఫల్యాలను తన పాదయాత్ర ద్వారా ఎత్తిచూపాలని భావించిన జగన్‌కు.. కోర్టు

రాష్ట్రంలోని ప్రధానప్రతిపక్షమైన వైకాపా, ఆ పార్టీ అధినేత జగన్ మోహన్ రెడ్డి పరిస్థితి ముందు నుయ్యి.. వెనుక గొయ్యిలా మారింది. ప్రభుత్వ వైఫల్యాలను తన పాదయాత్ర ద్వారా ఎత్తిచూపాలని భావించిన జగన్‌కు.. కోర్టు కేసులు బ్రేక్‌ వేసేలా కనిపిస్తున్నాయి. పార్టీ ప్లీనరీలో జగన్‌ నవరత్నాలు పేరుతో తొమ్మిది అంశాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని నిర్ణయించారు. ఇదే వేదిక నుంచి ప్రజా సమస్యలు తెలుసుకునేందుకు పాదయాత్ర చేస్తానని కూడా ప్రకటించారు. పాదయాత్రకు ముహూర్తం కూడా ప్రకటించేశారు. కానీ అడుగు ముందుకు పడలేదు.
 
దీనికి ప్రధాన కారణం అక్రమాస్తుల కేసు విచారణకు జగన్ మోహన్ రెడ్డి ప్రతి శుక్రవారం కోర్టుకు రావాలంటూ ఆదేశించడమే. దీంతో ఆయన ప్రతి శుక్రవారం కోర్టుకు వెళ్లి వస్తున్నారు. ఈ కారణంగా జగన్ పాదయాత్ర ప్రారంభానికి నోచుకోలేదు. అందుకే పాదయాత్రను దృష్టిలో ఉంచుకుని తాను కోర్టుకు హాజరుకావడం నుంచి మినహాయింపు ఇవ్వాలని న్యాయస్థానాన్ని కోరగా, కోర్టు ఇంకా ఎలాంటి నిర్ణయం వెల్లడించలేదు. 
 
అదేసమయంలో కోర్టు నుంచి అనుమతి పొంది పాదయాత్ర చేస్తే అది అధికార పార్టీకి అస్త్రంగా మారుతుందని వైసీపీ నేతలు భావిస్తున్నారు. దీంతో పాదయాత్రకు ప్రత్యామ్నాయంపైనా దృష్టిసారించారు. పాదయాత్రను కాదని ఏం చేస్తే బావుటుందన్న తర్జన భర్జనలు పార్టీ నేతల్లో మొదలయ్యాయి. పాదయాత్రకు ప్రత్యామ్నాయంగా జిల్లాల పర్యటనలు చేస్తే ఎలా ఉంటుందన్న చర్చ పార్టీలో జరుగుతోంది. కానీ, జగన్ మాత్రం వీలైనంత త్వరగా ప్రజాక్షేత్రంలోకి వెళ్లేందుకు ఉవ్విళ్లూరుతున్నారు. ఆరునూరైనా పాదయాత్రే చేపట్టాలన్న కృతనిశ్చయంతో ఉన్నారు.