శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. బిజినెస్
  3. కథనాలు
Written By సిహెచ్
Last Updated : గురువారం, 15 అక్టోబరు 2020 (22:10 IST)

2020లో రెసిడెన్షియల్‌ డిమాండ్‌, అగ్రస్థానంలో బెంగళూరు, నూతన సరఫరా పరంగా హైదరాబాద్‌

భారతదేశ వ్యాప్తంగా మార్కెట్‌లన్నీ కూడా కరోనా వైరస్‌ కారణంగా ఆర్ధికంగా కోలుకోలేని స్థితికి చేరినప్పటికీ 2020 సంవత్సర మూడవ త్రైమాసంలో గృహ మార్కెట్‌లన్నీ కూడా కాస్త శక్తిని పుంజుకున్నాయి. దక్షిణ భారతదేశపు గృహ మార్కెట్‌లో హైదరాబాద్‌ రియల్‌ ఎస్టేట్‌ దీనికి బాగా తోడ్పడింది. జూలై-సెప్టెంబర్‌ త్రైమాసికానికి అందుబాటులో ఉన్న సంఖ్యలు దీనిని సూచిస్తున్నాయి.
 
‘‘వినియోగదారులిప్పటికీ అత్యంత స్ధిరమైన ఆస్తిగా రియల్‌ఎస్టేట్‌ నిలుస్తుందని భావిస్తున్నారు. చాలామంది తమ ఇళ్లను ఆధునీకరించుకోవడానికి చూస్తున్నారు. ఎందుకంటే వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌ అనేది మరికొంత కాలం పాటు కొనసాగుతుందని భావిస్తున్నారు. అదేసమయంలో మహారాష్ట్ర లాంటి రాష్ట్రాలలో స్టాంప్‌ డ్యూటీ ధరలు ఆస్తుల లావాదేవీలపై తగ్గాయి. అంతేకాకుండా ఆర్ధిక సంస్థలు సైతం గృహ ఋణ వడ్డీరేట్లను 7%కు తీసుకువచ్చాయి. ఆర్‌బీఐ తమ రెపో రేటును 4%కు తీసుకువచ్చింది.
 
తమ వరకూ, డెవలపర్‌ కమ్యూనిటీ ఇప్పుడు వర్ట్యువల్‌ టూల్స్‌ ద్వారా కొనుగోలుదారులు తమ నిర్ణయాలను తీసుకునేందుకు తగిన ఏర్పాట్లు చేస్తున్నారు. దీనితోపాటుగా పండుగ రాయితీలు మరియు అతి సులభమైన చెల్లింపు ప్రణాళికలను సైతం అందిస్తుంది. ఈ పండుగ సీజన్‌లో అమ్మకాలు ప్రోత్సాహకరంగా ఉంటాయని మేము అంచనా  వేస్తున్నాం. అంతేకాదు, ఈ రంగంలో వేగంగా రికవరీకి ఇది తోడ్పడుతుందని అంచనా వేస్తున్నాం’’ అని మణి రంగరాజన్‌, గ్రూప్‌ సీఓఓ, హౌసింగ్‌ డాట్‌ కామ్‌, మకాన్‌ డాట్‌ కామ్‌ మరియు ప్రాప్‌ టైగర్‌ డాట్‌ కామ్‌ అన్నారు.
 
రియల్‌ ఎస్టేట్‌ బ్రోకరేజీ సంస్థ ప్రాప్‌టైగర్‌ డాట్‌ కామ్‌ భారతదేశ వ్యాప్తంగా ఎనిమిది ప్రధాన నగరాలలో చేసే త్రైమాస విశ్లేషణ రియల్‌ ఇన్‌సైట్‌ క్యు3, 2020 నివేదిక ప్రకారం, గత త్రైమాసంతో పోలిస్తే మూడు నెలల కాలానికి నూతన సరఫరా రెట్టింపుకన్నా ఎక్కువగా చూపిన ఒకే ఒక్క నగరంగా హైదరాబాద్‌ నిలిచింది. నిజానికి మొత్తంమ్మీద జాతీయ విశ్లేషణ చూస్తే క్యు3, 2020లో హైదరాబాద్‌ నగరం కన్నా అధికంగా నూతన ఆవిష్కరణలను చూసిన ఒకే ఒక్క నగరంగా పూణె నిలిచింది. త్రైమాసం (108%) అలాగే వార్షిక (4%) పద్ధతిలో, నూతన సరఫరా హైదరాబాద్‌లో కనిపించింది.
 
బెంగళూరులో, మరోవైపు నూతన సరఫరా రెండు రకాలుగానూ తగ్గింది. (క్యుఓక్యు -36% మరియు వైఓవై -72%). ఈ క్వార్టర్‌లో బిల్డర్లు కేవలం 2,086 యూనిట్లు మాత్రమే ప్రారంభించారు. చెన్నైలో కేవలం 947 నూతన యూనిట్లను మాత్రమే ఈ క్వార్టర్‌లో ప్రారంభించారు. దశలవారీగా అన్‌లాకింగ్‌ తరువాత ఆర్ధిక వ్యవస్ధ తిరిగి పుంజుకుంటున్న వేళ, రాబోతున్న పండుగ సీజన్‌ రెసిడెన్షియల్‌ రియల్‌ ఎస్టేట్‌ రంగంలో వేగాన్ని అందిస్తుందని అంచనా.
 
గృహ అమ్మకాల పరంగా దక్షిణ భారతదేశంలో అత్యధికంగా బెంగళూరులోనే సెప్టెంబర్‌ 30తో ముగిసిన త్రైమాసంలో కనిపించింది. మొత్తంమ్మీద ఈ కాలంలో 4825 యూనిట్లు ఇక్కడ విక్రయిస్తే అనుసరించి హైదరాబాద్‌, చెన్నై ఉన్నాయి. 
 
సెప్టెంబర్‌ 30 నాటికి ఈ మూడు నగరాలలో ఇన్వెంటరీ స్టాక్‌ 1,40,728గా చేరింది. ఈ స్టాక్‌లో బెంగళూరు వాటా అత్యధికంగా ఉంది. ఈ నివేదికలో ఉన్న ఎనిమిది నగరాలతో పోలిస్తే  హైదరాబాద్‌లో అతి తక్కువగా ఇన్వెంటరీ ఉంది(25 నెలలు). బెంగళూరు(36), చెన్నై (39)లు అత్యధికంగా ఉన్నాయి. అయితే, ఈ ఇన్వెంటరీ ఓవర్‌హ్యాంగ్‌ హైదరాబాద్‌లో గత సంవత్సరంతో పోలిస్తే చాలా ఎక్కువగా ఉంది. గత సంవత్సరం ఇదే కాలంలో 13 నెలల ఓవర్‌హ్యాంగ్‌ ఉంటే ఇప్పుడు అది 25 నెలలకు పెరిగింది. ఇన్వెంటరీ ఓవర్‌హ్యాంగ్‌ అనేది డెవలపర్‌ తన ప్రస్తుత స్టాక్‌ను విక్రయించే కాలం. ఈ అంచనాలను ప్రస్తుత అమ్మకాల వేగం దృష్టిలో పెట్టుకుని రూపొందిస్తారు.
 
హైదరాబాద్‌ మినహా, మిగిలిన రెండు  నగరాలలో వాల్యూ వృద్ధి ఏమాత్రం మారలేదు. హైదరాబాద్‌లో ఆస్తుల ధరలు గత సంవత్సర కాలంలో 6% వృద్ధి చెందాయి. ఇక్కడ చదరపు అడుగుకు 5,593 రూపాయలుగా ఉన్నాయి. బెంగళూరు, చెన్నై నగరాలలో ధరలు సెప్టెంబర్‌ 2019తో పోలిస్తే స్వల్పంగా పెరిగాయి. బెంగళూరులో  చదరపు అడుగు ధర 5310 రూపాయలుగా ఉంటే చెన్నైలో 5,240 రూపాయలుగా ఉంది.