1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. వ్యాధి
Written By chj
Last Modified: సోమవారం, 11 ఏప్రియల్ 2016 (21:45 IST)

యాంటీబయోటిక్స్‌తో విరేచనాలా?

బ్యాక్టీరియా ఇన్‌ఫెక్షన్లను నయం చేయటంలో యాంటీబయోటిక్ మందులు బాగా తోడ్పడతాయి. కానీ వీటితో చిక్కేటంటే.. ఇవి ఊపిరితిత్తుల వంటి అవయవాల్లోని బ్యాక్టీరియానే కాదు, మనకు మేలు చేసే పేగుల్లోని బ్యాక్టీరియానూ చంపుతాయి. దీంతో బ్యాక్టీరియా సమతుల్యత దెబ్బతిని విరేచనాలు, కడుపునొప్పి, గ్యాస్ వంటి సమస్యలు మొదలవుతాయి. దీర్ఘకాలం యాంటీబయోటిక్ మందులు వాడకంతో పెద్దపేగులో వాపునకు కారణమయ్యే సి.డిఫ్ ఇన్‌ఫెక్షన్ కూడా తలెత్తొచ్చు. అయితే యాంటీబయోటిక్స్ వాడుతున్నప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే విరేచనాల వంటి వాటిని తగ్గించుకోవచ్చు.
 
• యాంటీబయోటిక్స్ మూలంగా విరేచనాల సమస్యతో బాధపడేవారికి ప్రొబయోటిక్స్ ఎంతగానో ఉపయోగపడతాయి. ఇవి పేగుల్లో మనకు మేలు చేసే బ్యాక్టీరియా వృద్ధి కావటానికి తోడ్పడతాయి. బిళ్లలు, పొడుల రూపంలో దొరికే వీటిని డాక్టర్ల సలహా మీదనే తీసుకోవాలి. ఎందుకంటే రోగనిరోధకశక్తి తక్కువగా గలవారికి, అప్పటికే బాగా బలహీనంగా ఉన్నవారికివి హానికరంగా పరిణమించొచ్చు.
 
• పెరుగులోనూ ప్రొబయోటిక్స్ ఉంటాయి. కాబట్టి యాంటీబయోటిక్స్ సంబంధ విరేచనాలతో బాధపడేవారు పెరుగు తినటం మంచిది. అలాగే మసాలా పదార్థాలకు దూరంగా ఉండాలి. పీచు పదార్థాలనూ తగ్గించుకోవాలి. కొందరికి చక్కెరతో విరేచనాలు, గ్యాస్ వంటివి ఎక్కువ కావొచ్చు. ఇలాంటివాళ్లు తీపి పదార్థాలను తినకూడదు.
 
• యాంటీబయోటిక్స్‌ను డాక్టర్ చెప్పిన సమయంలోనే వేసుకోవాలి. ఎందుకంటే కొన్ని మందులను పరగడుపున వేసుకుంటే శరీరం బాగా గ్రహిస్తుంది. మరికొన్ని భోజనం చేశాక వేసుకుంటే గ్యాస్ వంటి సమస్యల బెడద తగ్గుతుంది. విరేచనాలు వేధిస్తుంటే ఒంట్లో నీటిశాతం తగ్గకుండా తగినంత నీరు తాగటం తప్పనిసరి. మద్యంతో యాంటీబయోటిక్ మందులు కలిస్తే తీవ్ర విపరిణామాలకు దారితీయొచ్చు. అందువల్ల మద్యం తీసుకోకపోవటం ఉత్తమం.