1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. వ్యాధి
Written By సిహెచ్
Last Updated : బుధవారం, 3 ఆగస్టు 2022 (20:05 IST)

Monkeypox: మంకీపాక్స్ వచ్చినప్పుడు చేయకూడనవి-చేయాల్సినవి ఏంటి? (video)

monkeypox
దేశంలో మంకీపాక్స్ కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఆరోగ్య- కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ బుధవారం మంకీపాక్స్ వ్యాధిపై పలు సూచనలు చేసింది. వ్యాధి వచ్చినప్పుడు ఏం చేయాలి? ఏం చేయకూడదన్నవి తెలియజేసింది. వ్యాధి సోకినప్పుడు చేయవలసినవి- చేయకూడనివి ఏమిటోనన్న వివరాలను జాబితా రూపంలో విడుదల చేసింది. ఆరోగ్య మంత్రిత్వ శాఖ తన అధికారిక ట్విట్టర్ హ్యాండిల్‌లో ఒక పోస్ట్‌లో, సోకిన వ్యక్తితో ఎక్కువ కాలం లేదా పదేపదే పరిచయం కలిగి ఉంటే మంకీపాక్స్‌ వచ్చే అవకాశం వుందని పేర్కొంది.

 
మంకీపాక్స్ పట్ల తీసుకోవలసిన జాగ్రత్తలు- చేయాల్సినవి 
మంకీపాక్స్ సోకిన రోగులను ఇతరుల నుండి వేరుచేయాలి.
చేతులను సబ్బు నీటితో శుభ్రం చేసుకోవాలి. హ్యాండ్ శానిటైజర్‌లను ఉపయోగించాలి.
వ్యాధి సోకిన వ్యక్తుల దగ్గర ఉన్నప్పుడు, మాస్క్‌లు- డిస్పోజబుల్ గ్లోవ్స్ ధరించండి.
పర్యావరణ శానిటైజేషన్ కోసం క్రిమిసంహారకాలను ఉపయోగించండి.
వ్యాధి సోకినవారు మూడు లేయర్ల మాస్కు ధరించాలి. దద్దుర్లు బయట గాలికి తగలకుండా వుండేందుకు చర్మాన్ని పూర్తిగా కప్పి వుంచే దుస్తులు ధరించాలి.

 
మంకీపాక్స్ వచ్చినప్పుడు చేయకూడనివి
మంకీపాక్స్ సోకిన వ్యక్తులు ఉపయోగించే టవల్స్, దుప్పట్లు, పరుపు పంచుకోరాదు.
మంకీపాక్స్ సోకిన వ్యక్తుల దుస్తులను మిగిలినవారి దుస్తులతో కలిపి ఉతకరాదు.
మంకీపాక్స్ లక్షణాలు కనబడినప్పుడు పబ్లిక్ ఈవెంట్‌లకు హాజరు కారాదు.
తప్పుడు సమాచారం ఆధారంగా బాధితుల పట్ల వివక్ష చూపించకూడదు.
 
 
భారత్‌లో ఇప్పటివరకు 9 మంకీపాక్స్ కేసులు నమోదయ్యాయి. దీనితో దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాలు ముందస్తు జాగ్రత్తలు పాటిస్తున్నాయి. దేశ రాజధాని ఢిల్లీలో మంకీపాక్స్ బాధితుల కోసం రెండు ప్రత్యేక ఐసోలేషన్ కేంద్రాలను ఏర్పాటు చేసారు.