1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. కథనాలు
Written By chitra
Last Updated : గురువారం, 28 జనవరి 2016 (10:44 IST)

సూర్యరశ్మి నుంచి శరీరాన్ని రక్షించే అవిసె నూనె...

సాధారణంగా అక్కడక్కడా రోడ్ల వెంట కనిపించే అవిసే చెట్టును సామాన్యంగా ఎవరూ పట్టించుకోరు. రోజువారీ ఆహారంలో అవిసె గింజల్ని భాగం చేసుకుని తినేవారు ఎక్కువ కాలం ఆరోగ్యంగా ఉంటారని నిపుణులు అంటున్నారు. పూర్వకాలంలో అవిసెగింజలతో చిట్కా వైద్యాలు ఎన్నో చేశారు మన పెద్దవాళ్ళు. ఎముకల అరుగుదల, జాయింట్ పెయిన్స్‌తో బాధపడేవారు అవిసెగింజలను ఆహార పదార్థాలతో పాటు తీసుకుంటే ఈ రోగాల నుండి ఉపశమనం లభిస్తుంది. వీటిలో ఉండే ఒమేగా యాంటీ ఆక్సిడెంట్ల కారణంగా కొలెస్ట్రాల్ స్థాయిలు చాలా వరకూ తగ్గుతాయి. అవిసెనూనె వలన కూడా చాలా లాభాలున్నాయి. అవేంటో చూద్దాం!
 
అవిసె గింజలు మెదడుకు శక్తిని పెంచే ఆహారం. వీటిలో ఉండే ఫ్యాటీయాసిడ్లు డిప్రెషన్‌ను కూడా సమర్థవంతంగా తగ్గిస్తుంది. అవిసెలో పీచు అధికంగా లభిస్తుంది. కనుక మలబద్దకం సమస్య కూడా తొలగిపోతుంది. సూర్య కిరణాల వేడికి చర్మం దెబ్బతినకుండా ఈ గింజల నుండి తీసే నూనె రాసుకోవడం వలన చర్మరక్షణ లభిస్తుంది.
 
చుండ్రు సమస్యను నివారించడంలో అవిసే నూనె బాగా తోడ్పడుతుంది. వెంట్రుకలు కూడా పెరిగి జుత్తు వత్తుగా అవుతుంది. ప్రస్తుతం పని ఒత్తిడి కారణంగా చాలామంది తలనొప్పితో బాధపడుతున్నట్లు సర్వేలు చెపుతున్నాయి. అధిక తలనొప్పితో బాధపడుతుంటే అవిసె నూనెను ఉపయోగించిన వంటలు లేక అవిసె ఆకును ఆహారంగా తీసుకుంటే తలనొప్పి మటుమాయమవుతుంది. కీళ్ళ సమస్యలు, నడుము నొప్పితో బాధపడేవారు అవిసె నూనెతో చేసిన వంటకాలు తింటే ఉపశమనం కలుగుతుందని వైద్యులు అంటున్నారు.