గర్భిణీ స్త్రీలు నామల చేపలు తినవచ్చా?
గర్భిణీలలో మాంసాహారం తినేవారికి పలు అనుమానాలు వుంటుంటాయి. ఏ చేపలు తినాలి, ఏ చేపలు తినకూడదు అనే దానిపై మీమాంస వుంటుంది. కొంతమంది చిన్నచేపలైన నామలు అని పిలువబడే చేపల్ని తినవచ్చా లేదా అని అనుమానిస్తుంటారు. ఈ చేపలను తినవచ్చు. ఇవి సముద్రపు చిన్న చేపలు కాబట్టి, గర్భధారణ సమయంలో వీటిని తినడం సురక్షితం, ఆరోగ్యకరమే. చిన్న చేపల వల్ల గర్భిణీలకు ఎటువంటి హాని కలగదు. అయితే, వీటిని వండేటప్పుడు కొన్ని ముఖ్యమైన జాగ్రత్తలు తప్పనిసరిగా పాటించాలి.
ఈ నామల చేపలు ఎందుకు సురక్షితం అంటే వీటిలో తక్కువ మెర్క్యురీ... అంటే పాదరసం వుంటుంది. పెద్ద పెద్ద సముద్రపు చేపలలో (సొరచేప, ట్యూనా వంటివి) మెర్క్యురీ ఎక్కువగా ఉంటుంది. కానీ, నామలు వంటి చిన్న చేపలు సముద్రంలో ఆహార గొలుసులో దిగువన ఉంటాయి. కాబట్టి వీటిలో మెర్క్యురీ స్థాయిలు చాలా తక్కువగా ఉంటాయి. ఇది పుట్టబోయే బిడ్డ మెదడు ఎదుగుదలకు దోహదపడుతుంది.
ఈ చిన్న చేపలలో ప్రొటీన్లు, కాల్షియం, ఐరన్ వంటి ముఖ్యమైన పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి గర్భంలో ఉన్న శిశువు ఎముకల బలానికి తోడ్పడతాయి. ఐతే వీటిని తినే గర్భిణీలు కొన్ని ముఖ్యమైన జాగ్రత్తలు పాటించాలి. పచ్చివి లేదా సగం ఉడికినవి తినకూడదు. చేపలను ఎప్పుడూ పూర్తిగా ఉడికించి మాత్రమే తినాలి.
పచ్చి చేపలలో ఉండే లిస్టెరియా వంటి బ్యాక్టీరియా వల్ల ఫుడ్ పాయిజనింగ్ అయ్యే ప్రమాదం ఉంది. అందుకే చేపలను బాగా ఉడికించాలి. చేప ముక్కలు లోపలి వరకు తెల్లగా మారి, ముట్టుకుంటే సులభంగా విడిపోయేలా బాగా ఉడికించాలి లేదా వేయించాలి. సముద్రపు చిన్న చేపలలో ఇసుక లేదా చిన్నపాటి వ్యర్థాలు ఉండే అవకాశం ఉంది. కాబట్టి వండే ముందు వాటిని ఉప్పు, పసుపు వేసి చాలా శుభ్రంగా కడగాలి. ఈ సమాచారం అవగాహన కోసం ఇవ్వబడింది. మరింత సమాచారం కోసం నిపుణులను సంప్రదించాలి.
పరిమితి: FDA (అమెరికా ఆహార సంస్థ) నిబంధనల ప్రకారం, గర్భిణీలు వారానికి 2 నుండి 3 సార్లు (మొత్తం కలిపి 250 నుండి 350 గ్రాములు) సురక్షితమైన చిన్న చేపలను నిశ్చింతగా తినవచ్చు.
