1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. కథనాలు
Written By Raju
Last Modified: హైదరాబాద్ , గురువారం, 27 ఏప్రియల్ 2017 (04:00 IST)

ఎసీ కావాలా నాయనా..! అయితే ఓకే.. వీటిని అనుభవించండి మరి!!

వేసవి శరీరాన్ని మండిస్తుంది. చల్లదనం ఎక్కడ ఉంటే అక్కడికి పారిపోదామనిపిస్తుంది. కారులో ఫుల్ ఏసీ పెట్టుకుని రైడ్ చేస్తే నా సామిరంగా.. స్వర్గమిక్కడే ఉందనిపిస్తుంది. వేసవి మూడు నెలలపాటు ఇంట్లో, బయటా ఏసీని వదిలి బయటకు రాకూడదనిపిస్తుంది. కానీ ప్రకృతి సహజమై

వేసవి శరీరాన్ని మండిస్తుంది. చల్లదనం ఎక్కడ ఉంటే అక్కడికి పారిపోదామనిపిస్తుంది. కారులో ఫుల్ ఏసీ పెట్టుకుని రైడ్ చేస్తే నా సామిరంగా.. స్వర్గమిక్కడే ఉందనిపిస్తుంది. వేసవి మూడు నెలలపాటు ఇంట్లో, బయటా ఏసీని వదిలి బయటకు రాకూడదనిపిస్తుంది. కానీ ప్రకృతి సహజమైన వాతావరణంలో శరీరం భరించదగ్గ ఉష్ణోగ్రతలో జీవించడం జీవరాసులన్నింటికీ ప్రకృతి పరమైన రక్షణను కల్పిస్తుంది. కానీ ప్రకృతి విరుద్ధమైన పద్దతుల్లో కృత్రిమ చల్లదనం కోసం మనం వేసే ప్రతి అడుగూ ఆరోగ్యానికి పెనుప్రమాదం కాక తప్పదని ప్రకృతి చికిత్సకారులు మొత్తుకుంటూనే ఉన్నారు. ఇప్పుడు పూర్తి కాలం ఏసీలో ఉండడం ద్వారా శరీరంలో కలిగే మార్పులు ఎలా ఉంటాయో చూద్దాం. 
 
తీవ్రమైన అలసట చాలాసేపు ఏసీలో గడపడంతో పాటు ఆ ఏసీ వల్ల చల్లదనం ఎక్కువగా ఉంటే కొందరిలో పనిముగిసే సమయానికి భరించలేని తలనొప్పి, తీవ్రమైన  నిస్సత్తువ వంటి లక్షణాలు కనిపిస్తాయి. చల్లటి వాతావరణంలో కండరాలకు తగినంత రక్తప్రసరణ జరగకపోవడం వల్ల అలసటకు గురవుతారు.
 
పొడి చర్మం చాలాసేపు ఏసీలో గడిపేవారి చర్మంపై తేమ తగ్గుతుంది, పొడిబారుతుంది. ఇలాంటి లక్షణాలు కనిపిస్తే చర్మంపై మాయిశ్చరైజర్‌ను రాసుకోవాలి.
 
కొన్ని రకాల దీర్ఘకాలిక సమస్యలు ఉన్నవారిలో... అంటే ఆర్థరైటిస్, న్యూరైటిస్‌ (నరాల చివరలు మొద్దుబారి స్పర్శ తెలియకపోవడం లేదా కాళ్లు, చేతులు తిమ్మిర్లు పట్టడం) వంటి జబ్బులు ఉన్నవారిలో ఆ సమస్యలు తీవ్రమవుతాయి. కొందరిలో ఈ న్యూరైటిస్‌ కారణంగా నిస్సత్తువ కలిగే అవకాశాలు ఎక్కువ.
 
గతంలో వేడి వాతావరణంలో ఉన్నవారైనప్పటికీ నిత్యం ఏసీలో ఉండటం అలవాటైన వారు ఇక ఏమాత్రం వేడిమిని భరించలేరు. వేసవిలో బయటకు రావడమే కష్టంగా అనిపిస్తుంది. దాంతో తేలిగ్గా వడదెబ్బకు గురవుతుంటారు.
 
చాలాసేపు ఏసీ కారులో మూసి ఉన్న డోర్స్, గ్లాసెస్‌ వల్ల అక్కడి సూక్ష్మజీవులు అక్కడే తిరుగుతుండటం వల్ల తేలిగ్గా  శ్వాససంబంధమైన వ్యాధులకు గురవుతుంటారు. 
 
అందుకే నిత్యం ఏసీలో ఉండేవారు తప్పనిసరిగా ప్రతి రెండు గంటలకు ఒకసారి కాసేపు బయటకు వచ్చి స్వాభావిక వాతావరణంలో పదినిమిషాల పాటైనా గడిపి వెళ్తుండాలి. అది ఆరోగ్యానికి మేలు చేస్తుంది.