1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. కథనాలు
Written By chitra
Last Updated : శుక్రవారం, 15 ఏప్రియల్ 2016 (16:11 IST)

ప్రయాణ సమయంలో ఎలాంటి బ్రేక్ ఫాస్ట్ తీసుకోవాలి?

ప్రతి రోజు ఉదయాన్నే బ్రేక్ ఫాస్ట్ తీసుకోవడం చాలా ముఖ్యం. ఉదయం పూటతినే ఆహారమే రోజంతా మనలో ఉత్తేజాన్ని నింపుతుంది. కనుక తప్పనిసరిగా బ్రేక్ ఫాస్ట్ తీసుకోవాలి. అయితే ఉదయం పూట కేకులు తినడం సరికాదు. చక్కెర, వెన్నతో చేసినవి పొద్దున్నే తినడం వల్ల శరీరంలోకి ఎక్కువ కెలోరీలు చేరతాయి. వేయించిన బంగాళాదుంపల్నీ అల్పాహారంలో తీసుకుంటే అరుగుదల అంతగా ఉండదు. పొట్టకి ఇబ్బందిని కలిగిస్తుంది. ప్రయాణ సమయాల్లో ఫ్రెంచ్ ఫ్రైస్, బంగాళాదుంపలతో చేసిన స్నాక్స్‌కి దూరంగా ఉండటం ఉత్తమం.
 
త్వరగా తయారవుతాయని నూడుల్స్‌ను చాలా మంది తీసుకుంటారు. వాటిల్లో సొడియం అధికంగా ఉంటుంది. ఇలాంటి మసాలా కలగలిసిన వాటిని తీసుకుంటే ఎండలో వెళ్ళినప్పుడు వికారంగా ఉంటుంది. వీలైనంత వరకు తేలిగ్గా జీర్ణమయ్యే అల్పాహారం తీసుకోవడం మంచిది. కొందరు రాత్రి మిగిలిన చికెన్ వంటకాలను మర్నాడు వేడి చేసి తింటారు. ఇలా చేస్తే హాని చేసే ట్రాన్స్ ఫ్యాట్లు శరీరంలోకి చేరిపోతాయి.
 
కొందరు పండ్ల రసాలను తయారుచేసి ఫ్రిజ్‌లో నిల్వ చేస్తుంటారు. కానీ ఎప్పటికప్పుడు చేసిన వాటికే ప్రాధాన్యమివ్వాలి. ముందురోజు చేసిన వాటిని మర్నాడు ఉదయం తాగడం వల్ల పొట్టలో బ్యాక్టీరియా చేరుతుంది. పోషకాలు సరిగా అందవు. ఇక ఉదయం పూట గుడ్డు తినడం మంచిదే. అయితే నూనెలో ఫ్రై చేయకుండా ఆరగించవచ్చు. మధ్యాహ్నం, రాత్రి పూట అలా తీసుకోవడం బాగానే ఉంటుంది. ఉదయం తీసుకోవడం వల్ల అధిక శాతం కొలెస్ట్రాల్ శరీరానికి చేరుతుంది. అందుకే ఉడికించిన గుడ్డు తీసుకొంటే చాలు.