శనివారం, 30 నవంబరు 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. వార్తలు
Written By ఠాగూర్
Last Updated : శనివారం, 20 జూన్ 2020 (07:49 IST)

కరోనాకు కషాయం తయారు చేసిన చెన్నై 'సిద్ధ' వైద్యులు

ప్రపంచాన్ని పట్టిపీడిస్తున్న కరోనా వైరస్‌కు ఇప్పటివరకు ఏ ఒక్క దేశం కూడా మందును కనిపెట్టలేదు. కరోనాకు విరుగుడు వ్యాక్సిన్‌పై ప్రపంచ దేశాలన్నీ పరిశోధనలు చేస్తున్నాయి. ప్రపంచ ఆరోగ్య సంస్థ సైతం ఈ పరిశోధనల్లో నిమగ్నమైవుంది. అయితే, చెన్నై సిద్ధ వైద్యులు మాత్రం ఓ కషాయాన్ని తయారు చేశారు. ఇది కరోనా వైరస్ బారినపడిన రోగులకు ఇవ్వగా, వారంతా కోలుకున్నట్టు పేర్కొన్నారు. ఈ కషాయం పేరు కఫసుర. ఈ మూలికా ఔషధాన్ని చెన్నై, తాంబరంలోని నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ సిద్ధ వైద్యులు తయారు చేశారు. 
 
ఈ కఫసురా కషాయం తయారీ కోసం 'సిద్ధ' అసిస్టెంట్‌ మెడికల్‌ ఆఫీసర్‌ డాక్టర్‌ వి. విక్రమ్‌ కుమార్‌ నేతృత్వంలో గత డిసెంబరులోనే పరిశోధనలు ప్రారంభించారు. ఆ తర్వాత ఈ కషాయాన్ని కరోనా రోగులకు చెందిన రెండు బృందాలకు ఏప్రిల్‌ 1 నుంచి ఐదు రోజుల పాటు ఈ ఔషధం అందించారు. ఏప్రిల్‌ 6న వారికి పరీక్షలు చేయగా నెగెటివ్‌ వచ్చింది. 
 
అలాగే, ఏప్రిల్‌ 20న జరిపిన పరీక్షల్లోనూ నెగెటివ్‌ వచ్చింది. ఇక మే, జూన్‌లలోనూ ఎస్‌ఆర్‌ఎం ఆస్పత్రిలోని కరోనా బాధితులపై ప్రయోగాత్మకంగా పరీక్షించారు. ఇక్కడ కూడా కరోనా పాజిటివ్‌ వచ్చిన వారికి ఐదు రోజుల్లోనే నెగెటివ్ వచ్చింది. అయితే, దీనిపై సిద్ధ వైద్యులు ధీమాగా ఉన్నప్పటికీ.. కేంద్ర ఆయుష్ శాఖ మంత్రి మరికొంత పరిశోధన తర్వాత అధికారికంగా ప్రకటించే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది.