మంగళవారం, 16 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 15 జూన్ 2020 (16:31 IST)

గ్రేటర్ చెన్నై పరిధిలో లాక్డౌన్.. కఠిన ఆంక్షలతో 19 నుంచి అమలు!

దేశంలో కరోనా కేసులు అత్యధికంగా నమోదవుతున్న రాష్ట్రాల్లో తమిళనాడు రెండో స్థానంలో ఉంది. ముఖ్యంగా ఈ రాష్ట్ర రాజధాని చెన్నైలో ఈ కేసులు పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్నాయి. దీంతో ఈ నెల 19వ తేదీ నుంచి పూర్తిస్థాయి లాక్డౌన్ అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ కంప్లీట్ లాక్డౌన్ ఈ నెల 19వ తేదీ నుంచి ఈ నెల 30వ తేదీ వరకు కొనసాగనుంది. ఇది గ్రేటర్ చెన్నై పరిధిలోకి వచ్చే చెన్నై, చెంగల్పట్టు, తిరువళ్లూరు, కాంచీపురం జిల్లాల్లో పూర్తిస్థాయి లాక్డౌన్ అమలుకానుంది. 
 
ఈ లాక్డౌన్ సమయంలో ఆటోలు, టాక్సీలు, ప్రైవేట్ వాహనాలను అనుమతించరు. ఎమర్జెన్సీ అయితే, మినహా ప్రైవేట్ వాహనాలను అనుమతించరు. లాక్డౌన్ విధిస్తున్న ఈ నాలుగు జిల్లాల్లో నిబంధనలు మరింత కఠినతరం చేయాలని తమిళనాడు ప్రభుత్వం సర్కారు నిర్ణయించింది. అలాగే, ప్రస్తుతం అమల్లో ఉన్న అన్ని రకాల సడలింపులను రద్దు చేయనున్నారు. 
 
కిరాణా సరకుల, కూరగాయల దుకాణాలు మాత్రం ఉదయం 6 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు మాత్రమే తెరిచివుంచనున్నారు. హోటళ్లు, రెస్టారెంట్లలో పార్సిళ్లకు మాత్రమే అనుమతిస్తున్నారు. కాగా, ప్రస్తుతం తమిళనాడు రాష్ట్రంలో 42,607 మందికి కరోనా సోకింది. 23409 మంది కోలుకున్నారు. 397 మంది చనిపోయారు. గ్రేటర్ చెన్నై పరిధిలో ఈ కేసుల సంఖ్య విపరీతంగా పెరుగుతోంది.