మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. చిట్కాలు
Written By సిహెచ్
Last Modified: గురువారం, 18 అక్టోబరు 2018 (21:32 IST)

నువ్వుల నూనెతో అలా మర్దన చేసుకుంటుంటే...?

మన దైనందిన జీవితంలో ప్రతినిత్యం వివిధ రకాల ఆహార పదార్ధాలను ఉపయోగిస్తూ ఉంటాం. వీటిలో ముఖ్యమైనవి నువ్వులు. వీటిలో నల్లనువ్వులు, తెల్లనువ్వులు, గోధుమరంగు నువ్వులు అని మూడు రకాలు ఉన్నాయి. వీటిలో ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయి. నువ్వులు శరీర పోషణకు, ఆరోగ్య పరిరక్షణకు ఎంతో మేలు చేస్తాయి. వీటితోటి నువ్వుల పచ్చడి, నువ్వులపొడి, నువ్వుల చిమ్మిలి వంటి పదార్ధాలను తయారుచేసుకోవచ్చు. 
 
నువ్వుల నుండి తీసిన నూనెను పూజకు, హోమాలకు ఉపయోగిస్తూ ఉంటారు. వీటిని వేయించి ఔషధాల తయారీలో వాడుతుంటారు.
 
మలబద్దకం... 100 గ్రాముల నల్ల నువ్వులలో, 100 గ్రాముల బెల్లం కలిపి దంచి ఒక సీసాలో నిల్వ ఉంచుకోవాలి. రాత్రి పడుకునేటప్పుడు ఉసిరికాయంత తిని, ఆ తర్వాత 100 మిల్లీ లీటర్ల పాలు లేదా, గోరువెచ్చని నీరు త్రాగాలి. ఇలా చేయడం వల్ల రక్తహీనత కూడా తగ్గుతుంది. చక్కెర వ్యాధిగ్రస్తులు బెల్లం లేకుండా కేవలం 5 గ్రాముల నల్ల నువ్వుల పొడిని 100 మిల్లీ లీటర్ల వేడి పాలలో కలిపి రాత్రిపూట త్రాగుతుండాలి.
 
కీళ్ల నొప్పులకు... నువ్వుల చూర్ణం, శొంఠి చూర్ణం సమానంగా కలిపి ఉంచుకొని రెండుపూటలా పూటకు అరటీస్పూన్ చొప్పున తేనెతో కలిపి వాడాలి. చక్కెర వ్యాధి ఉన్నవాళ్లు 100 మిల్లీ లీటర్ల పాలు లేదా నీళ్లతో కలిపి త్రాగాలి.
 
నోటిపూతకు.... నువ్వుల చూర్ణం, పటికబెల్లం పొడి ఒక్కొక్కటి 50 గ్రాముల చొప్పున తీసుకొని రెండింటిని కలిపి ఒక సీసాలో నిల్వ ఉంచుకోవాలి. రెండు పూటలా అరస్పూన్ పొడిని ఒక టీస్పూన్ వెన్నతో కలిపి సేవించడం వలన నోటిపూత తగ్గుతుంది.
 
సుఖనిద్ర... నువ్వుల నూనెను బాగా వేడి చేసి పక్కన పెట్టి నాల్గవ వంతు కర్పూరం కలిపి మూత పెట్టి చల్లారిన తర్వాత ఒక సీసాలో నిల్వ ఉంచుకొని రోజుకు ఒకసారి అరికాళ్లకు మర్ధన చేస్తుంటే చక్కటి నిద్ర పడుతుంది.