శుక్రవారం, 3 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 8 ఆగస్టు 2023 (14:46 IST)

భీకర గాలులు.. 2600 విమానాలు రద్దు.. ఎక్కడ?

us flights
అగ్రరాజ్యం అమెరికాలో వాతావరణ ప్రతికూల పరిస్థితులు తారసపడుతున్నాయి. తాజాగా భీకర గాలుల కారణంగా ఏకంగా 2600 విమానాలను రద్దు చేశారు. ముఖ్యంగా తూర్పు అమెరికాలో పరిస్థితి తీవ్రంగా ఉంది. ఇక్కడ భీకర గాలులు, ఉరుములతో కూడిన వర్షం, వడగళ్లు విరుచుకుపడ్డాయి. టెనసీ నుంచి న్యూయార్క్‌ వరకు 10 రాష్ట్రాల్లో కల్లోల వాతావరణ పరిస్థితులు ఏర్పడ్డాయి. 
 
చెట్లు మీదపడిన, పిడుగుపాటుకు గురైన ఘటనల్లో ఇద్దరు మృతి చెందారు. వేలాది విమానాలు రద్దయ్యాయి. 11 లక్షల ఇళ్లు, వ్యాపారాలకు విద్యుత్‌ సదుపాయం లేకుండా పోయింది. ఈ కారణంగా, దాదాపు మూడు కోట్ల మంది టోర్నడోల ముప్పు ఎదుర్కొన్నారని 'జాతీయ వాతావరణ సేవల విభాగం' తెలిపింది. 
 
మరోవైపు, దేశ రాజధాని వాషింగ్టన్‌ డీసీలో ప్రభుత్వ కార్యాలయాలతోపాటు ఇతర సేవలను ముందుగానే మూసేశారు. తీరప్రాంత వరద హెచ్చరికలు కొనసాగుతున్నాయి. న్యూయార్క్, వాషింగ్టన్, ఫిలడెల్ఫియా, అట్లాంటా, బాల్టిమోర్‌లలోని విమానాశ్రయాల్లో రాకపోకలు నిలిచిపోయాయి. ఫ్లైట్ ట్రాకింగ్ సైట్ 'ఫ్లైట్‌అవేర్' ప్రకారం.. సోమవారం రాత్రి నాటికి 2,600కుపైగా విమానాలు రద్దయ్యాయి. మరో 7,900 విమానాలు ఆలస్యంగా నడిచాయి.