శుక్రవారం, 24 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By కుమార్
Last Updated : బుధవారం, 17 ఏప్రియల్ 2019 (15:52 IST)

తొమ్మిదేళ్లకే రూ. 7 కోట్లు జాక్‌పాట్ గెలుచుకున్న లక్కీ గర్ల్

ఒక భారతీయ బాలికకు దుబాయ్‌లో అదృష్టం వరించింది. తొమ్మిదేళ్ల వయసున్న ఆ అమ్మాయికి మిలియన్ డాలర్ల జాక్‌పాట్ గెలుచుకుని ఒక్కరోజులో కోటీశ్వరురాలైంది. అయితే ఈ అమ్మాయికి చిన్నప్పటి నుండే అదృష్టం వరిస్తోందట. 2013లో మూడేళ్ల వయస్సు ఉండగానే లగ్జరీ కారును గెలుచుకుని, మళ్లీ ఆరేళ్ల తర్వాత అంటే 2019లో మిలియన్ డాలర్ల లాటరీని గెలుచుకుంది.
 
వివరాల్లోకి వెళితే దుబాయిలో ప్రతి సంవత్సరం ‘దుబాయ్ డ్యూటీ ఫ్రీస్ మిలీనియమ్ మిలియనీర్’ పేరుతో లాటరీ నిర్వహిస్తుంటారు. దీని ప్రైజ్‌మనీ మిలియన్ డాలర్లు, భారతీయ కరెన్సీలో 7 కోట్ల రూపాయలు. అయితే ఈ ఏడాది ఎమ్. ఎలీజా అనే భారత సంతతి బాలిక తండ్రి ఈ లాటరీని ఆమె పేరుపై 0333 నంబర్ గల లాటరీ టిక్కెట్ కొన్నాడు. అదృష్టవశాత్తూ అతను కొనుగోలు చేసిన నంబర్‌కే లాటరీ తగలడంతో తన కూతురు అదృష్టవంతురాలని మురిసిపోతున్నాడు.
 
తాను దుబాయ్‌లో 19 ఏళ్లుగా ఉంటున్నానని, అయితే 15 ఏళ్లుగా ప్రతి ఏడాది ఈ లాటరీని కొంటున్నానని అతను చెప్పాడు. అతని లక్కీ నంబర్ 9 కావడంతో 0333 నంబర్ టిక్కెట్‌ను తన తొమ్మిదేళ్ల కూతురు పేరిట కొన్నానని, దానికే ప్రైజ్‌మనీ రావడంతో తన ఆనందానికి అవధులు లేవని చెబుతున్నాడు. కాగా ఈ లాటరీలో విజేతగా నిలిచిన 140వ భారతీయురాలిగా ఎలీజా రికార్డుకెక్కినట్లు అధికారులు పేర్కొన్నారు.