రాజుకుటుంబం పేరు చెప్పి రూ.50 లక్షలు మోసం... భారతీయ పూజారి అరెస్టు

arrest
సందీప్| Last Updated: శుక్రవారం, 15 మార్చి 2019 (14:56 IST)
దుబాయ్ రాజకుటుంబం పేరు వాడుకుని రూ.50 లక్షల వరకు అక్రమంగా కొట్టేసి, రాజకుటుంబ సభ్యుడిని మోసం చేసిన ఆరోపణలపై నాసిక్ కాలారామ్ ఆలయ ప్రధానార్చకుడు మహంత్ సుధీర్ ప్రభాకర్ పూజారిని దుబాయ్‌ పోలీసులు అరెస్టు చేసారు. దుబాయ్‌లో వ్యాపార కార్యకలాపాలు నిర్వహించే సుధీర్ దాస్‌, నిధుల సమీకరణం కోసం తమ పేరును దుర్వినియోగం చేసినట్లు రాజ కుటుంబానికి చెందిన సభ్యులు ఫిర్యాదు చేయడంతో పోలీసులు ఆయనను గత గురువారంనాడు అదుపులోకి తీసుకున్నారు. అయితే, అరెస్టు చేసిన కొన్ని గంటల్లోనే ఆయన బెయిల్‌పై విడుదలయ్యారు.

మహంత్ దాస్ బెయిల్ కోసం తాము సహకరించినట్లు దుబాయ్‌లోని ఇండియన్ కాన్సుల్ జనరల్ ప్రకటించింది. సుధీర్ దాస్ బెయిల్‌పై బయటకు వచ్చినా ఆయన పాస్‌పోర్టును మాత్రం పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కాగా, పూజారీ నాసిక్‌లోని తన సన్నిహితులతో తాను తన పాస్‌పోర్ట్‌ని పోగొట్టుకున్నాననీ, ప్రస్తుతం షార్జాలో ఉన్నాననీ చెప్పడం విశేషం. అర్చకుడి వ్యవహారంలో సహాయం చేయాలని విదేశాంగ శాఖకు నాసిక్ ఎంపీ హేమంత్ గొదాసే, ఎమ్మెల్యే హరీశ్చంద్ర చవాన్‌లు లేఖ రాసారు. దుబాయ్ అధికారులతో మాట్లాడి సుధీర్ పాస్‌పోర్టు వెనక్కు ఇప్పించేందుకు చర్యలు తీసుకుని, స్వదేశానికి వచ్చే ఏర్పాట్లు చేయాలని ఆ లేఖలో పేర్కొన్నారు.

గతంలో ప్రయాగ్ రాజ్‌లో జరిగిన కుంభమేళాలోనూ కీలకంగా వ్యవహరించిన సుధీర్ దాస్‌కి వీహెచ్‌పీ, ఆర్‌ఎస్ఎస్ ముఖ్యనేతలతో మెరుగైన సంబంధాలు ఉన్నాయి. ఇటీవలే ముంబై నుంచి దుబాయ్‌కు తన వ్యాపార కార్యకలాపాలను విస్తరించిన సుధీర్ దాస్, అక్కడ పలు సంస్థలను ప్రారంభించినట్లు సమాచారం. ఇందులో భాగంగా దుబాయ్‌కు వెళ్లిన ఆయనను విమానాశ్రయంలోనే అరెస్టు చేశారు.దీనిపై మరింత చదవండి :