మంగళవారం, 7 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By ఎం
Last Updated : గురువారం, 3 అక్టోబరు 2019 (09:51 IST)

అమెరికాలో కూలిన యుద్ధవిమానం.. ఏడుగురి దుర్మరణం

యుద్ధ విమానం కుప్పకూలిన ఘటనలో ఏడుగురు మరణించారు. అమెరికాలోని కనెక్టికట్ ప్రాంత బ్రాడ్లీ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఘటన జరిగింది.

రెండో ప్రపంచ యుద్ధం నాటి బీ-17 బాంబర్ విమానం బ్రాడ్లీ అంతర్జాతీయ విమానాశ్రయంలో అత్యవసరంగా ల్యాండింగ్ చేస్తుండగా కుప్పకూలిపోయింది. ఈ యుద్ధ విమానం టేకాఫ్ అయిన పదినిమిషాలకే సాంకేతిక లోపం ఏర్పడటంతో అత్యవసర ల్యాండింగ్ చేసేందుకు యత్నించారు. విమానం ల్యాండింగ్ చేస్తుండగా రన్ వేపై నియంత్రణ కోల్పోయి కుప్పకూలిపోయింది.

ఈ విమానంలో 13 మంది ఉండగా ఏడుగురు మరణించారు. మరో ఆరుగురు గాయపడటంతో వారిని ఆసుపత్రికి తరలించామని ఎమర్జెన్సీ సర్వీసులు, ప్రజారక్షణశాఖ కమిషనర్ జేమ్స్ రోవెల్లా చెప్పారు. ఈ విమానం ల్యాండింగ్ చేస్తుండగా రన్ వేపై ఉన్న మరో వ్యక్తి గాయపడ్డారు.

విమానం కూలిన రన్ వేపై మంటలతో పాటు దట్టమైన పొగ వ్యాపించింది. దీంతో బ్రాడ్లీ అంతర్జాతీయ విమానాశ్రయాన్ని మూడున్నర గంటలపాటు మూసివేశారు. యుద్ధ విమాన ప్రమాదంపై అమెరికా జాతీయ రవాణ భద్రతా బోర్డు దర్యాప్తు చేస్తోంది.