పాకిస్థాన్ నుంచి డ్రోన్ల ద్వార తుపాకుల సరఫరా

drones
ఎం|
పాకిస్థాన్ దేశం నుంచి అక్రమంగా తుపాకులను సరిహద్దుల్లో ఉన్న పంజాబ్ రాష్ట్రానికి డ్రోన్ల ద్వార అక్రమంగా చేరవేస్తున్నట్లు పంజాబ్ పోలీసుల దర్యాప్తులో తేలింది. పంజాబ్ పోలీసులు మరో ఖలిస్థానీ ఉగ్రవాదిని బుధవారం నాడు అమృతసర్ నగరంలో అరెస్టు చేశారు.

పాకిస్థాన్ దేశం నుంచి ఉగ్రవాదుల కోసం డ్రోన్ల ద్వార తుపాకులను రహస్యంగా చేరవేస్తున్నారని పోలీసుల దర్యాప్తులో వెల్లడి కావడంతో జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) రంగంలోకి దిగి దర్యాప్తు ప్రారంభించింది. ఖలిస్థాన్ జిందాబాద్ ఫోర్స్ కు చెందిన సాజన్ ప్రీత్ అనే ఉగ్రవాదిని పంజాబ్ ప్రత్యేక పోలీసులు ఇటీవల అరెస్టు చేశారు.

అమృతసర్ నగరంలోని ఖల్సా కళాశాల నుంచి సాజన్ ప్రీత్ ను అరెస్టు చేశారు. పాకిస్థాన్ దేశం నుంచి తాజాగా డ్రోన్ ద్వార రెండు పిస్టళ్లను తెప్పించారని సమాచారం. పాక్ డ్రోన్ ను ధ్వంసం చేసి రెండు తుపాకులను విక్రయించారని పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది.

గత వారం పంజాబ్ పోలీసులు పాక్ దేశానికి చెందిన రెండు డ్రోన్లను పంజాబ్ సరిహద్దుల్లో స్వాధీనం చేసుకున్నారు. జబల్ పట్టణంలోని తరన్ తరణ్ ప్రాంతంలో దహనమై ఉన్న పాక్ డ్రోన్ కనిపించింది. తుపాకుల అక్రమ రవాణా కోసం పాక్ పెద్ద డ్రోన్లను కూడా వినియోగిస్తుందని హోంమంత్రిత్వశాఖ దర్యాప్తులో తేలింది.

ఖలిస్థాన్ ఉగ్రవాదులు పాక్ ప్రేరేపిత ఉగ్రవాదులకు సహకరిస్తున్నారని తేలడంతో ఎన్ఐఏ రంగంలోకి దిగి తుపాకుల అక్రమ రవాణ బాగోతంపై దర్యాప్తు చేస్తోంది.

సరిహద్దుల్లో హైఅలర్ట్
జమ్మూకశ్మీర్, పంజాబ్ రాష్ట్రాల్లోని అమృతసర్, పటాన్‌కోట్, శ్రీనగర్ తదితర భారత వాయుసేన కేంద్రాలపై జైషే మహ్మద్ ఉగ్రవాదులు ఆత్మాహుతి దాడులకు తెగబడవచ్చని అందిన ఇంటలిజెన్స్ వర్గాల సమాచారంతో భారత సైనికులు అప్రమత్తమయ్యారు.

శ్రీనగర్, అవంతిపూర్, జమ్మూ, పటాన్ కోట్, హిందన్ వాయుసేన కేంద్రాల్లో ఆరంజ్ అలర్ట్ ప్రకటించారు. ఈ సందర్భంగా వాయుసేన కేంద్రాల్లో రాకపోకలపై ఆంక్షలు విధించారు. దీంతోపాటు ముందుజాగ్రత్తగా పాఠశాలలను మూసివేశారు. 24 గంటలు అప్రమత్తంగా ఉండేలా భద్రతా బలగాలను మోహరించారు.

బాలాకోట్ లోని ఉగ్రవాద శిబిరాలపై జరిపిన వాయుసేన దాడుల్లో ధ్వంసమైనా వాటిని పునరుద్ధరించారని, ఉగ్రవాదులు సరిహద్దుల్లోకి వచ్చేందుకు యత్నిస్తున్నారని భారత ఆర్మీ చీఫ్ బిపిన్ రావత్ ప్రకటించిన నేపథ్యంలో ఇంటలిజెన్స్ హెచ్చరికలు అందాయి. దీంతో వాయుసేన కేంద్రాలపై దాడులు జరగవచ్చనే సమాచారంతో ఆయా కేంద్రాల్లో హైఅలర్ట్ ప్రకటించారు.దీనిపై మరింత చదవండి :