గురువారం, 26 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By ప్రీతి
Last Updated : మంగళవారం, 29 జనవరి 2019 (16:15 IST)

ఇక వారానికి నాలుగు రోజులే వర్కింగ్ డేస్... ప్రపంచ స్థాయి సదస్సులో ప్రతిపాదన

సాధారణంగా చాలా కంపెనీలలో వారానికి ఆరు రోజులు వర్కింగ్ డేస్, ఒకరోజు హాలిడే ఉంటాయి. ఇక సాఫ్ట్‌వేర్ కంపెనీలు, అంతర్జాతీయ సంస్థలు వంటి వాటిలో ఐదు రోజులు వర్కింగ్ డేస్‌గా, రెండు రోజులు హాలిడేగా ఉంటాయి. వీక్ డేస్‌లో ఉండే పని ఒత్తిడి వలన ఉద్యోగులందరూ వీకెండ్ ఎప్పుడొస్తుందా అని ఎదురుచూస్తుంటారు.
 
ఇక సాఫ్ట్‌వేర్ రంగంలో ఉండేవారి పరిస్థితి అయితే చెప్పనక్కర్లేదు. వీకెండ్‌లో రిలాక్స్ అవ్వడానికి ముందుగానే ప్లాన్స్ చేసుకుంటుంటారు. అయితే ఐదు రోజులు కాకుండా నాలుగు రోజులే వర్క్ చేయించుకుని, మూడు రోజులు ఆఫ్ ఇస్తే పనితీరు ఇంకా బాగా మెరుగుపడుతుందని, మంచి ప్రొడక్టివిటీ వస్తుందని ప్రపంచవ్యాప్తంగా కొత్త వాదన వినిపిస్తోంది. అంతేకాకుండా దీనికి విశేష మద్దతు లభిస్తోంది.
 
పని ఒత్తిడి ఎక్కువగా ఉంటే ఉత్పాదకత తగ్గిపోయే ప్రమాదముంది. సో, నాలుగు రోజులే వర్కింగ్ డేస్ అయితే ఉద్యోగులు మరింత ఉత్సాహంగా పనిచేస్తారు, తద్వారా 5 రోజులలో వచ్చే ప్రొడక్టివిటీ కంటే ఎక్కువ ఉంటుందని నిపుణుల అభిప్రాయం. ఇందుకు సంబంధించి దావోస్‌లో జరిగిన ప్రపంచ ఆర్థిక సదస్సులో చర్చ జరిగింది. ఈ నిర్ణయానికి ఆర్థికవేత్తలు, సైకాలజిస్టులు కూడా తమ మద్దతును తెలిపారు.
 
వర్కింగ్ డేస్‌ను తగ్గించడం వల ఉద్యోగులు సంతృప్తిగా పని చేయడంతో పాటుగా 20 శాతం ఉత్పాదకత పెరిగే అవకాశముందని పలు సర్వేలు,  అధ్యయనాలలో కూడా వెల్లడైనట్లు నిపుణులు చెప్తున్నారు. ఇప్పటికే చాలామంది ఉద్యోగులు తమ సంస్థలో ఇప్పుడు ఉన్న 5, 6 రోజుల పని విధానం, ఒత్తిడితో కుటుంబానికి సమయం కేటాయించలేక, సమస్యలతో పనిపై దృష్టి కేంద్రీకరించలేకపోతున్నామని వాపోయారు. ఈ 4 వర్కింగ్ డేస్ విధానంతో ఆ సమస్యలకు చెక్ పెట్టవచ్చని నిపుణుల అభిప్రాయం. చర్చల దశలో ఉన్న ఈ ప్రతిపాదన ఎప్పుడు అమలవుతుందో వేచి చూడాల్సిందే.