మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 10 అక్టోబరు 2019 (15:20 IST)

వాగ్దానాలు నెరవేర్చని మేయర్.. ట్రక్కుకు కట్టి ఈడ్చుకెళ్లిన ప్రజలు : ఎక్కడ?

రాజకీయ నేతలు ఎన్నికల సమయంలో లేనిపోని హామీలు ఇస్తుంటారు. ఎన్నికల్లో గెలిచిన తర్వాత తాము చేసిన వాగ్దానాలను విస్మరిస్తుంటారు. అలా ఒక వ్యక్తి ఎన్నికల్లో గెలుపొంది మేయర్ అయ్యారు. ఆయన చేసిన వాగ్దానాలు మరిచిపోవడంతో ఆయన్ను ట్రక్కుకు కట్టేసి ఈడ్చుకెళ్లారు. ఈ దారుణ ఘటన మెక్సికో నగరంలో చోటుచేసుకుంది. 
 
ఈ వివరాలను పరిశీలిస్తే, జార్జ్ లూయిస్ ఎస్కాండన్‌ హెర్నాండెజ్ను అనే వ్యక్తి చిపాస్ రాష్ట్రంలోని లాస్ మార్గరీటాస్ మేయర్‌గా ఉన్నారు. ఈయన ఎన్నికల్లో పోటీ చేస్తూ అనేక వాగ్దానాలు చేశారు. కానీ, ఎన్నికలు అయ్యాక ఆయన తాను చేసి వాగ్దానాలను మరచిపోయారు. దీంతో తోజోలాబల్ కమ్యూనిటీకి చెందిన 30 మంది సభ్యులు మేయర్ కార్యాలయంలోకి చొరబడి మేయర్‌ బయటకు లాక్కొచ్చారు. 
 
అనంతరం పికప్ ట్రక్ వెనుక భాగంలో కట్టి ఈడ్చుకెళ్లారు. ఇలా కొన్ని మీటర్లు లాక్కెళ్లారని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. చివరకు పోలీసుల జోక్యంతో ప్రాణాపాయం నుంచి మేయర్ తృటిలో క్షేమంగా బయటపడ్డాడు. ఈ ఘటన చిపాస్ రాష్ట్రంలోని లాస్ మార్గరీటాస్ పట్టణంలో మంగళవారం రాత్రి ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ  ఉదంతానికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతోంది.
 
అయితే ఈ సంఘటన జరిగిన ఎనిమిది గంటల తర్వాత, మేయర్ హెర్నాండెజ్ లాస్ మార్గరీటాస్‌లో ప్రసంగించారు, శాంటారీటా సమాజంలోని నాయకులు దీనికి బాధ్యులుగా ప్రకటించారు. కిడ్నాప్‌, హత్యాహత్నం కింద ఫిర్యాదు చేయనున్నట్టు తెలిపారు. అటు ఈ సంఘటనలో 10 మంది గాయపడ్డారని, 11 మందిని అరెస్టు చేసినట్లు ప్రాసిక్యూటర్ జనరల్ కార్యాలయం తెలిపింది.