సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : ఆదివారం, 1 మార్చి 2020 (12:10 IST)

యుద్ధం వల్ల విసిగిపోయారు.. త్వరలోనే తాలిబన్ అగ్ర నాయకుల్ని కలుస్తా!

యుద్ధం వల్ల ప్రతి ఒక్కరూ విసిగిపోయారని, సుదీర్ఘకాలం జరిగిన ఘర్షణలో ఎంతోమంది ప్రాణాలు పోగొట్టుకున్నారని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆందోళన వ్యక్తం చేశారు. అమెరికా-తాలిబన్ల మధ్య శనివారం జరిగిన శాంతి ఒప్పందం పట్ల ట్రంప్ హర్షం వ్యక్తం చేశారు. చాలాకాలం నుంచి పోరాడుతున్న తమ సైనికులను ఈ సందర్భంగా అభినందించారు.
 
''తాలిబన్లతో శాంతి ఒప్పందం ఎంతో చారిత్రకమైంది. ఆప్ఘన్ ప్రభుత్వంతో జరిగే తదుపరి చర్చలు ఎంతో క్లిష్టమైనవని ప్రతిఒక్కరూ వాదిస్తున్నారు. కానీ, అది కూడా విజయవంతంగానే ముగుస్తుందని భావిస్తున్నా. ఎందుకంటే యుద్ధం వల్ల అందరూ విసిగిపోయారు. ఎంతో మంది ప్రాణాలు కోల్పోయారు'' అని శ్వేతసౌధంలో మీడియాతో అన్నారు. త్వరలోనే తాలిబన్ల అగ్ర నాయకులను వ్యక్తిగతంగా కలుస్తానని ట్రంప్‌ చెప్పారు. ఒప్పందంలోని నిబంధనల్ని అమలుపరుస్తూ వారు శాంతిస్థాపనకు కృషి చేస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. 
 
ఒప్పందం అమలైతే సేనల్ని వెనక్కి రప్పించేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. 18 ఏళ్ల యుద్ధానికి తెరదించడానికి ఇరుపక్షాలకు ఇది గొప్ప అవకాశం అన్నారు. తాలిబన్‌-అమెరికా సేనల మధ్య కుదిరిన ఈ ఒప్పందాన్ని భారత్‌ సహా అంతర్జాతీయ సమాజం స్వాగతించాయి.