ఆ ఆస్పత్రిలో కరోనా పేషెంట్లకు వెంటిలేటర్ తీసేస్తే.. నర్సులు డ్యాన్స్ చేస్తారు..
అగ్రరాజ్యం అమెరికాలో కరోనా వైరస్ విజృంభిస్తోంది. కరోనా బాధితులకు వైద్యులు, నర్సులు 24 గంటల పాటు చికిత్స అందిస్తూ గడుపుతున్నారు. అయితే అమెరికాలోని ఓ ఆస్పత్రిలో పనిచేసే నర్సులు కాసేపు అలా చిందులేస్తూ సంతోషంగా గడిపారు.
దీన్ని ఓ డాక్టర్ వీడియో తీసి నెట్టింట షేర్ చేశాడు. కరోనాతో లక్షలమంది ప్రాణాలు పోతుంటే ఈ చిందులేంటని తొలుత కోపగించుకున్నవారే.. ఆ తర్వాత నర్సుల డ్యాన్సులకు అసలు విషయం తెలుసుకుని ఫిదా అయిపోయారు.
ఇంతకీ ఆ కారణమేంటంటే.. అమెరికాలోని రోనాల్డ్ రీగన్ యూసీఎల్‌ఏ మెడికల్ సెంటర్‌లో కరోనా వైరస్ సోకిన వారికి చికిత్స అందిస్తున్నారు. ఈ వైరస్ సోకిన వారిని వెంటిలేటర్‌పై ఉంచి చికిత్స అందిస్తారు. పేషెంట్ కోలుకోగానే వెంటిలేటర్ తీసేస్తారు.
ఇలా ఓ పేషెంట్‌కు వెంటిలేటర్ తీసేసిన ప్రతిసారీ ఈ ఆస్పత్రిలోని ఐసీయూ టీం నర్సులు ఇలా డ్యాన్సులు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట్లో తెగ హల్‌చల్ చేస్తోంది. కరోనా నుంచి కోలుకుని వెళ్లే ప్రతి పేషెంట్ ఇంటికి వెళ్లడంతోనే నర్సులు ఆనందం వ్యక్తం చేస్తూ ఇలా చిందులేస్తూ గడుపుతున్నారు.