గురువారం, 23 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By
Last Updated : ఆదివారం, 19 మే 2019 (15:30 IST)

పుర్రెలో వైఫై యాంటెన్నా ఫిక్స్ .... రంగులు గుర్తిస్తున్న వర్ణాంధత యువకుడు

అమెరికాకు చెందిన ఓ యువకుడు పుట్టుకతోనే వర్ణాంధతతో జన్మించాడు. అంటే.. అతనికి చూపు ఉంది. కానీ. ఆయన చూసే ప్రతిదీ నలుపు - తెలుపు (బ్లాక్ అండ్ వైట్)గానే కనిపిస్తుంది. రంగు వస్తువులు చూసినప్పటికీ అవి నలుపు తెలుపుగానే కనిపిస్తాయి. ఈ సమస్యను అ యువకుడు తల్లిదండ్రులు 11 యేళ్ల వయసులో గుర్తించారు. అతని పేరు నీల్ హార్బిసన్. 
 
అయితే, ఇంగ్లండ్‌లో ఓ మ్యూజిక్ సింఫనీ నోట్స్ అధ్యయనం చేసే క్రమంలో అతడు రంగులను గుర్తించలేక నానా అవస్థలు పడ్డాడు. దాంతో తనను వేధిస్తున్న ఆ లోపాన్ని అధిగమించేందుకు అందుబాటులో ఉన్న సాంకేతిక పరిజ్ఞానాన్ని ఆశ్రయించాడు. 
 
తనే స్వయంగా పరిశ్రమించి తలలో అమర్చుకునే విధంగా ఓ వైఫై యాంటెన్నా తయారు చేశాడు. వైద్యుల సాయంతో తలలో దాన్ని ఫిక్స్ చేయించుకున్నాడు. అప్పటి నుంచి కంటిముందు కనిపించే రంగులను ఆ యాంటెన్నా గుర్తించి శబ్దాల రూపంలో వినిపిస్తుంది. ఆ శబ్దాల ఆధారంగా ఎదురుగా ఉన్న వస్తువు ఏ రంగులో ఉన్నదీ నీల్ హార్బిసన్ పసిగట్టేస్తాడు.
 
ఓ షాపింగ్ మాల్ వెళితే అక్కడున్న రంగురంగుల వస్తువులను గుర్తించిన యాంటెన్నా డీజే మ్యూజిక్ తరహాలో ధ్వనులు చేయడం తనను ఎంతగానో ఆకట్టుకుంటుందని నీల్ హార్బిసన్ సరదాగా చెబుతుంటాడు. కాగా, ఈ యువకుడు పుర్రెలో యాంటెన్నా ఫిక్స్ చేసుకున్న మొదటి సైబోర్గ్ (సగం మనిషి, సగం యంత్రం)గా అమెరికా ప్రభుత్వం అనుమతి కూడా పొందాడు.