అమెరికాలో మరో నల్లజాతీయుడి హత్య...
అగ్రరాజ్యం అమెరికాలో నల్లజాతీయులకు ఏమాత్రం రక్షణ లేకుండా పోయింది. ఇటీవల జార్జ్ ఫ్లాయిడ్ అనే ఓ నల్లజాతీయుడిని పోలీసులు అకారణంగా చంపేసిన విషయం తెల్సిందే. ఈ హత్యతో అమెరికా దేశ వ్యాప్తంగా అల్లర్లు చెలరేగాయి. ఇవి చల్లారకముందే మరో నల్ల జాతీయుడు పోలీసుల చేతిలో ప్రాణాలు కోల్పోయాడు.
ఈ ఘటన నేపథ్యంలో అట్లాంటాలో మరోసారి పెద్ద ఎత్తున నిరసనలు ప్రారంభమయ్యాయి. దీంతో ఆ నగర పోలీసు చీఫ్ రాజీనామా చేశారు. రెషార్డ్ బ్రూక్ అట్లాంటాలోని ఓ రెస్టారెంటు ముందు రాత్రి సమయంలో కారును నిలిపి అందులోనే నిద్రపోయాడు.
ఈ విషయంపై పోలీసులకు ఆ రెస్టారెంట్ యజమాని ఫిర్యాదు చేశాడు. అక్కడికి చేరుకున్న పోలీసులు అతడు మత్తులో ఉన్నట్లు తెలుసుకుని అరెస్టు చేయడానికి ప్రయత్నించగా అతడు తిరగబడ్డాడు.
అంతేగాక, ఓ పోలీసు తుపాకీని లాక్కొని పరుగులు తీశాడు. ఈ సమయంలో కాల్పులకు పాల్పడ్డాడు. దీంతో పోలీసులు అతడి కాళ్లపై కాల్పులు జరిపారని అధికారులు తెలిపారు. అనంతరం అతడిని ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు.