1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 13 ఆగస్టు 2021 (09:45 IST)

హుబే నగరాన్ని ముంచెత్తిన భారీ వరదలు - 21 మంది మృతి

సెంట్రల్ చైనాలోని హుబే ప్రావిన్స్‌లోని ఐదు నగరాల్లో గత కొన్ని రోజులుగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. ఈ భారీ వర్షాలతో వరదలు వెల్లువెత్తడంతో రెడ్ అలెర్ట్ ప్రకటించారు. సుయిజౌ నగరంలో భాగమైన లియులిన్ టౌన్‌షిప్‌లో వరదల వల్ల 21 మంది మరణించారు. 
 
మరో 2,700 కి పైగా ఇళ్లు, దుకాణాలు వరదనీటిలో మునిగాయి. వరదల ధాటికి విద్యుత్, రవాణా, కమ్యూనికేషన్ల వ్యవస్థలు దెబ్బతిన్నాయి. భారీ వర్షాల కారణంగా 21 మంది మరణించగా, దాదాపు 6,000 మంది ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు.
 
యిచెంగ్ నగరంలో గురువారం రికార్డు స్థాయిలో 400 మిల్లీమీటర్ల వర్షం కురిసింది. సుజౌ, జియాంగ్యాంగ్, జియావోగన్ నగరాల్లో వరద సహాయ పనులు చేపట్టేందుకు చైనా అత్యవసర నిర్వహణ మంత్రిత్వి శాఖ రెస్క్యూ సిబ్బందిని పంపించింది. 
 
హుబేలోని 774 రిజర్వాయర్లు గురువారం సాయంత్రానికి వరదనీటితో నిండటంతో వరద హెచ్చరికలు జారీ చేశారు.వరదల వల్ల 8,110 హెక్టార్లలో పంటలు దెబ్బతిన్నాయి.యాంగ్జీ నది వెంట ఉన్న ప్రాంతాల్లో వరదనీరు ప్రవహిస్తోంది.