1. క్రీడలు
  2. ఇతర క్రీడలు
  3. వార్తలు
Written By ఠాగూర్
Last Updated : ఆదివారం, 8 ఆగస్టు 2021 (17:55 IST)

ఘనంగా ముగిసిన టోక్యో ఒలింపిక్స్ క్రీడలు - భారత్‌కు 48వ స్థానం

టోక్యో వేదికగా జరిగిన ఒలింపిక్స్  క్రీడా సంబరాలు ఆదివారం ఘ‌నంగా ముగిశాయి. 19 రోజులపాటు మొత్తం ప్రపంచాన్ని ఉర్రూతలూగించిన ఈ ఆట‌ల పండుగ‌.. క్లోజింగ్ సెర్మ‌నీతో సాయొనారా (గుడ్‌బై) చెప్పింది. ముగింపు సంద‌ర్భంగా మ‌రోసారి అన్ని దేశాల‌కు చెందిన అథ్లెట్లు త‌మ జాతీయ ప‌తాకాల‌తో స్టేడియంలోకి వ‌చ్చారు. 
 
భారత తరపున బ్రాంజ్ మెడ‌ల్ విన్న‌ర్, రెజ్ల‌ర్ భ‌జ‌రంగ్ పూనియా త్రివ‌ర్ణ ప‌తాకంతో సంద‌డి చేశాడు. క‌రోనా మ‌హ‌మ్మారి వ‌ణిక‌స్తున్న స‌మ‌యంలో విజ‌యవంతంగా ఈ విశ్వ‌క్రీడా సంబ‌రాన్ని నిర్వ‌హించిన టోక్యోకు అథ్లెట్లు కృతజ్ఞ‌త‌లు తెలిపారు. 
 
క్లోజింగ్ సెర్మనీ ప్రారంభంలో జ‌పాన్ క్రౌన్ ప్రిన్స్ అకిషినో, ఐఓసీ అధ్యక్షుడు థామ‌స్ బాక్‌తో క‌లిసి స్టేడియంలోకి వ‌చ్చారు. మూడేళ్ల త‌ర్వాత 2024లో ఈ గేమ్స్‌ను నిర్వ‌హించ‌డానికి ఫ్రాన్స్ రాజ‌ధాని పారిస్ సిద్ధ‌మ‌వుతోంది. 
 
ఇదిలావుంటే, టోక్యో ఒలింపిక్స్ పతకాల పట్టికలో అమెరికా నెంబర్ వన్ గా నిలిచింది. ఆఖరి వరకు అమెరికా, చైనా మధ్య హోరాహోరీ పోరు నెలకొంది. అయితే చివర్లో అనేక క్రీడాంశాల్లో అమెరికా పసిడి పతకాలు నెగ్గి చైనాను వెనక్కి నెట్టింది.
 
అమెరికా 39 స్వర్ణాలు, 41 రజతాలు, 33 కాంస్యాలు సహా మొత్తం 113 పతకాలు సాధించింది. చైనా 38 పసిడి పతకాలు, 32 రజతాలు, 18 కాంస్యాలతో మొత్తం 88 పతకాలు చేజిక్కించుకుని రెండోస్థానంలో నిలిచింది. 
 
ఇక, ఆతిథ్య జపాన్ 27 స్వర్ణాలతో మూడో స్థానంలో నిలవగా, ఆ తర్వాత వరుసగా బ్రిటన్ (22 స్వర్ణాలు), రష్యా ఒలింపిక్ కమిటీ జట్టు (20 స్వర్ణాలు) టాప్-5లో నిలిచాయి.
 
భారత్‌కు పతకాల పట్టికలో 48వ స్థానం దక్కింది. భారత్ ఖాతాలో 1 స్వర్ణం, 2 రజతాలు, 4 కాంస్యాలు ఉన్నాయి.