శుక్రవారం, 24 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరోనా
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 3 ఆగస్టు 2021 (23:47 IST)

వుహాన్‌లో మళ్లీ వైరస్‌ కలకలం.. 24 గంటల్లో 84 కేసులు

చైనా, వుహాన్‌లో మళ్లీ వైరస్‌ కలకలం రేపుతోంది. దాదాపు ఏడాది తర్వాత వుహాన్‌లో మళ్లీ కరోనా విజృంభిస్తోంది. గత 24 గంటల్లో చైనాలో 84 కేసులు నమోదు కాగా.. అందులో ఎనిమిది మంది వుహాన్‌ వాళ్లే ఉన్నారు. వుహాన్‌లో బయటపడ్డ కేసుల్లో ముగ్గురిలో కరోనా లక్షణాలు ఉండగా.. ఐదుగురు అసింప్టమాటిక్‌ అని తేలింది. వీరందరినీ ఐసోలేషన్‌లో ఉంచడంతో పాటు వారి కాంటాక్ట్స్‌ను గుర్తిస్తున్నారు. 
 
అంతేకాకుండా వుహాన్‌లోని దాదాపు కోటి మంది జనాభాకు పరీక్షలు చేయాలని నిర్ణయించారు. కరోనాను గుర్తించేందుకు న్యూక్లిక్ యాసిడ్ పరీక్షను ప్రారంభిస్తున్నట్లు చైనా అధికారులు వెల్లడించారు.
 
ప్రపంచంలో తొలి కరోనా కేసు.. 2019 చివర్లో వుహాన్‌లోనే బయటపడింది. అక్కడి నుంచి అన్ని దేశాలకు పాకింది. అప్పుడు వుహాన్‌లో దాదాపు 76 రోజులపాటు కఠిన లాక్‌డౌన్‌ను అమలు చేసింది డ్రాగన్‌. కట్టుదిట్టమైన చర్యలతో అక్కడ వైరస్‌ అదుపులోకి వచ్చింది. మళ్లీ ఏడాది తర్వాత ఇప్పుడు కేసులు బయటపడ్డాయి.
 
చైనాలో ప్రస్తుతం డెల్టా వేరియంట్ వ్యాప్తి చెందుతుండటంతో.. పలు నగరాల్లో ఆంక్షలను కఠినతరం చేశారు. ప్రజలను ఇళ్లకే పరిమితం చేసి.. రవాణా సదుపాయాలను కుదించారు. అలాగే భారీ స్థాయిలో టెస్టులు చేస్తున్నారు.