బుధవారం, 8 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 22 జులై 2021 (11:46 IST)

చైనాలో కుంభవృష్టి.. రైల్వే టన్నెల్‌లో నీరు... 13 మంది మృతి

చైనాలో కుంభవృష్టి కురుస్తోంది. ఈ దేశాన్ని గత కొన్ని రోజులుగా భారీ వర్షాలు అతలాకుతలం చేస్తున్నాయి. వరదల కారణంగా నిర్మాణ పనులు కొనసాగుతున్న ఓ సొరంగంలో చిక్కుకున్న 13 మంది కార్మికులు మృతిచెందారు. ఝాంగ్జౌ నగరం జింగ్యే ఎక్స్​ప్రెస్​వేలోని షిజింగ్​షాన్​ సొరంగంలో ఈ ఘటన జరిగింది. 
 
ఈ నెల 15వ తేదీన మొత్తం 14 మంది కార్మికులు ఈ సొరంగంలో చిక్కుకున్నారు. ఇప్పటివరకు 13 మంది మృతదేహాలను వెలికితీశారని ప్రభుత్వ మీడియా​ తెలిపింది. మరో కార్మికుడి ఆచూకీ కోసం సహాయక చర్యలు కొనసాగుతున్నాయని చెప్పింది.
 
మరోవైపు చైనాలో అతి భారీ వర్షాలు పడుతున్నాయి. హెనాన్‌ ప్రావిన్స్‌లో గత 1000ఏళ్లలో ఎన్నడూ లేనంతగా రికార్డు స్థాయిలో కుంభవృష్టి కురవడంతో భీకర వరదలు సంభవించాయి. ఫలితంగా 25 మంది చనిపోగా.. మరో ఏడుగురు గల్లంతయ్యారు. 
 
మరోవైపు, హెనన్‌ ప్రావిన్స్‌లో గత వెయ్యేండ్లలో లేనంత రికార్డు స్థాయిలో వర్షపాతం నమోదైంది. ప్రావిన్స్‌ రాజధాని జెంగ్‌జౌలో మంగళవారం ఒక్కరోజే 45.7 సెంటీమీటర్ల వాన పడింది. ప్రావిన్స్‌లో అనేక ప్రాంతాలు నీట మునిగాయి. భీకర వరదలు సంభవించాయి. రోడ్లన్నీ నదులను తలపిస్తున్నాయి. కార్లు కాగితపు పడవల్లా వరదల్లో కొట్టుకుపోతున్నాయి. వరదల కారణంగా 25 మంది చనిపోయారు. ఏడుగురు గల్లంతయ్యారు.
 
ఓ రైల్వే టన్నెల్‌లో భారీగా నీరు చేరడంతో రైలు ప్రయాణికులతో అందులోనే ఇరుక్కుపోయింది. రైల్లో ప్రయాణికుల మెడల వరకు నీరు చేరిన దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అయ్యాయి. ఇందులో 13 మంది చనిపోయారు. 500 మందికి పైగా ప్రయాణికులను రక్షించారు. 
 
సహాయకార్యక్రమాల కోసం సైన్యం రంగంలోకి దిగింది. ఈ భారీ వర్షాల ప్రభావం 12.4 లక్షల మందిపై పడింది. ఇప్పటివరకు 1.60 లక్షల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. రవాణా నిలిచిపోయింది. 250కి పైగా విమాన సర్వీసులను రద్దు చేశారు. యిచువాన్‌ కౌంటీలో భారీ వరద నీటిని దారి మళ్లించడానికి సైన్యం ఓ పాడుబడిన డ్యామ్‌ను పేల్చేసింది.