దేశంలో విజృంభిస్తోన్న కరోనా.. 24 గంటల్లో 52,050 కేసులు.. 803 మంది మృతి
దేశంలో కరోనా వైరస్ విజృంభిస్తోంది. వివిధ రాష్ట్రాల నుండి కొత్త కేసులు పెరుగుతూనే ఉన్నాయి. దేశంలో కేసుల సంఖ్య 18 లక్షల 50 వేలు దాటింది. గడిచిన 24 గంటల్లో భారత్‌లో 52,050 కేసులు నమోదు కాగా, 803 మంది ప్రాణాలు విడిచారు. గడిచిన 24 గంటలలో దేశ వ్యాప్తంగా 44,306 మంది కోలుకొని డిశ్చార్జి అయ్యారని కేంద్ర ఆరోగ్య శాఖ హెల్త్ బులిటెన్ విడుదల చేసింది.
దేశంలో మొత్తం 18,55,745 కేసులు నమోదయ్యాయి. ప్రస్తుతం యాక్టివ్ కేసులు 5,86,298 ఉండగా, 12,30,509 మంది కోలుకొని డిశ్చార్జి అయ్యారు. ఇదిలా ఉండగా 38,938 మంది కరోనా వ్యాధితో మరణించారు. ప్రస్తుతం దేశంలో కరోనా బాధితుల రికవరీ రేటు 66.31 శాతంగా ఉంది.
ఇక మహారాష్ట్రలో కరోనా తీవ్రత కొనసాగుతూనే ఉంది. ఇప్పటికే రాష్ట్రంలో 15,700 కొవిడ్ మరణాలు సంభవించాయి. నిత్యం అక్కడ 250కిపైగా కొవిడ్ రోగులు ప్రాణాలు కోల్పోతుండటం ఆందోళన కలిగిస్తోంది.
తమిళనాడు, ఢిల్లీలలో ఇప్పటివరకూ 4వేల చొప్పున కరోనా మరణాలు చోటుచేసుకున్నాయి. గుజరాత్, కర్ణాటక రాష్ట్రాల్లోనూ 2500చొప్పున కరోనా మరణాలు సంభవించాయి. ఇదిలా ఉంటే.. ప్రపంచంలో కొవిడ్ కేసుల్లో భారత్ మూడోస్థానంలో ఉండగా, మరణాల్లో ఐదో స్థానంలో కొనసాగుతోంది.