చైనా వెన్నులో వణుకుపుట్టిస్తున్న భారత్ : భారీగా బలగాల మొహరింపు
చైనా వెన్నులో భారత్ వణుకుపుట్టిస్తోంది. భారత్‌ను దొంగదెబ్బ కొట్టాలని డ్రాగన్ కంట్రీ కుట్రలు పన్నుతోంది. అలాగే, భారత్ కూడా ఆ కుట్రలను ఛేదిస్తూ చైనాకు ధీటుగా స్పందిస్తోంది. దీంతో చైనా వెన్నులో వణుకుపుడుతోంది.
ఇటీవల తూర్పు లడఖ్‌లోని గాల్వాన్ లోయ వద్ద భారత సైనికులపై దొంగచాటుగా చైనా బలగాలు దాడి చేశాయి. ఈ దాడిలో 21 మంది భారత జవాన్లు ప్రాణాలు కోల్పోయారు. చైనా వైపు కూడా భారీ ప్రాణనష్టం సంభవించినట్టు వార్తలు వచ్చాయి. కానీ, ఈ వార్తలపై చైనా స్పందించలేదు. ఆ తర్వాత ఇరుదేశాల మధ్య చర్చలు జరుగాయి. దీంతో పరిస్థితులు కాస్త చక్కబడ్డాయని భావించారు.
కానీ, చైనా మాత్రం తన వక్రబుద్ధిని మార్చుకోలేదు. భారత సరిహద్దులో చైనా మళ్లీ దుస్సాహసానికి దిగుతోంది. తూర్పు లడఖ్‌లోని దౌలత్ బేగ్ బోల్డీ, దెప్సాంగ్ ప్రాంతాల్లో దాదాపు 17 వేల మంది సైనికులను, యుద్ధ విమానాలను మోహరించి ఉద్రిక్తతలు పెంచే ప్రయత్నం చేస్తోంది.
అంతేకాదు, పెట్రోలింగ్ పాయింట్ల (పీపీ) వద్ద భారత బలగాలను చైనా సైనికులు అడ్డుకుంటున్నట్టు కూడా తెలుస్తోంది. దీంతో అప్రమత్తమైన భారత్.. చైనా ఏదైనా దుస్సాహసానికి దిగాలంటే ఒకటికి పదిసార్లు ఆలోచించేలా పెద్ద ఎత్తున బలగాలను తరలించినట్టు సమాచారం.
ముఖ్యంగా కారకోరం పాస్ దగ్గర్లోని పీపీ 1 దగ్గరి నుంచి దెప్సాంగ్‌కు పెద్ద ఎత్తున బలగాలను తరలించినట్టు సైనిక వర్గాలు తెలిపాయి. మొత్తం 15 వేల మంది జవాన్లు అక్కడ సిద్ధంగా ఉన్నట్టు సమాచారం.
ఇటీవల భారత భూభాగంలోని పీపీ 7, పీపీ 8 మధ్య చైనా గతంలో నిర్మించిన చిన్నపాటి వంతెనను భారత సైనికులు కూల్చివేశారు. దీంతో ఇప్పుడు టీడబ్ల్యూడీ బెటాలియన్ ప్రధాన కార్యాలయం నుంచి కారకోరం కనుమ వరకు రోడ్డు నిర్మించాలని చైనా భావిస్తోంది.