భారత్‌కు సెల్యూట్ చేస్తున్న ఐక్యరాజ్య సమితి చీఫ్
ప్రపంచాన్ని కరోనా వైరస్ కబళించిన వేళ భారత్ వంటి దేశాలకు ఐక్యరాజ్య సమితి సెల్యూట్ చేస్తోంది. ఈ వైరస్ బారినపడి తల్లడిల్లిపోతున్న అనేక దేశాలకు భారత్ చేస్తున్న సాయం ఎన్నటికీ మరువలేనిదని ఐరాస చీఫ్ ఆంటోనియో గుటెరస్ వ్యాఖ్యానించారు. అందుకే భారతదేశానికి సెల్యూట్ చేస్తున్నట్టు చెప్పుకొచ్చారు.
దాదాపు 210 ప్రపంచ దేశాలను వణికిస్తున్న కరోనా వైరస్‌కు కొంతమేరకు అడ్డుకట్ట వేసే మందు కేవలం భారత్ వద్ద మాత్రమే ఉంది. అదే హైడ్రాక్సీక్లోరోక్వీన్. ఈ మందు కోసం అమెరికా వంటి అగ్రదేశాలు భారత్ సాయాన్ని కోరాయి. పైగా, కోవిడ్ సమస్య పరిష్కారం కోసం భారత్ విశేషంగా కృషి చేస్తోంది. అందుకే భారత్‌కు సెల్యూట్ చేస్తున్నట్టు ఆయన ప్రకటించారు.
మరోవైపు, కొవిడ్-19 చికిత్సలో ఆ డ్రగ్ సత్ఫలితాలనిస్తుందని అమెరికా ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ కొన్ని వారాల క్రితం గుర్తించింది. కరోనా వైరస్ విజృంభణ నేపథ్యంలో ప్రపంచం పట్ల అన్ని దేశాలు సంఘీభావం తెలపాలని, ఇతర దేశాలకు సాయం చేసే సామర్థ్యం ఉన్న దేశాలు... ఆ పని చేయాలని గుటెరస్ కోరారని ఐరాస ప్రతినిధి స్టీఫెన్ డుజార్రిక్ చెప్పారు.
ఇకపోతే, కరోనా వైరస్ సమస్య ఎదుర్కొంటున్న సుమారు 55 దేశాలకు హైడ్రాక్సీ క్లోరోక్విన్‌ను సరఫరా చేయాలని భారత్ భావిస్తోంది. ఆఫ్ఘనిస్థాన్, భూటాన్, బంగ్లాదేశ్, నేపాల్, మాల్దీవులు, శ్రీలంక, మయన్మార్లకు ఔషధాలు పంపుతోంది. అలాగే, జాంబియా, ఉగాండా, కాంగో, ఈజిప్ట్, ఆర్మేనియా, ఈక్వెడార్, సిరియా, ఉక్రెయిన్, చాంద్, జింబాబ్వే, ఫ్రాన్స్ , కెన్యా, నెదర్లాండ్స్, నైజీరియా, ఒమన్, పెరూ వంటి దేశాలకు కూడా హైడ్రాక్సీ క్లోరోక్విన్‌ను సరఫరా చేస్తోంది.