గురువారం, 23 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరోనా
Written By ఠాగూర్
Last Updated : శనివారం, 18 ఏప్రియల్ 2020 (08:59 IST)

కర్నూలులో కరోనా డేంజర్ బెల్స్... వైద్యుడి కుటుంబంలో ఆరుగురికి వైరస్

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కర్నూలు జిల్లాల్లో కరోనా వైరస్ ప్రమాద ఘంటికలు మోగిస్తోంది. ఫలితంగా ప్రతి రోజూ పదుల సంఖ్యలో కొత్త కేసులు నమోదవుతూనే ఉన్నాయి. ముఖ్యంగా, కర్నూలు, గుంటూరు జిల్లాల్లో ఈ కేసులు ఎక్కువగా వెలుగు చూస్తున్నాయి. తాజాగా కర్నూలులో ఓ వైద్యుడి కుటుంబానికి ఈ వైరస్ సోకింది. ఫలితంగా ఆయన కుటుబంలోని సభ్యులందరికీ ఈ వైరస్ సోకిందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. 
 
కర్నూలు జిల్లాలో గురువారం ఉదయం నుంచి శుక్రవారం ఉదయం 10 గంటల మధ్య పట్టణంలో 13 కేసులు నమోదు కాగా, వీటిలో ఆరు కేసులు ఇటీవల కరోనాతో మరణించిన ఓ ప్రైవేటు ఆసుపత్రి వైద్యుడి కుటుంబ సభ్యులవే కావడం గమనార్హం. అలాగే, కర్నూలు సర్వజన ఆసుపత్రిలో పనిచేస్తున్న ఓ వైద్యురాలికి వైరస్ సోకినట్టు అధికారులు తెలిపారు. రాష్ట్రం మొత్తం కేసుల్లో 44 శాతం వరకు గుంటూరు, కర్నూలు జిల్లాలలోనే నమోదు కావడం గమనార్హం. 
 
కాగా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య 572కు చేరుకున్న విషయం తెల్సిందే. వీటిలో 38 కొత్త కేసులు ఉన్నాయి. 14 మంది చనిపోయారు. మొత్తం 572 కేసుల్లో 523 కేసులు యాక్టివ్ కేసులుగా ఉన్నాయి. కాగా, గుంటూరు, కర్నూలు జిల్లాల్లో ఈ కరోనా వైరస్ విజృంభిస్తున్న విషయం తెల్సిందే. ఆ తర్వాత నెల్లూరు, అనంతపురం, చిత్తూరు జిల్లాల్లో ఈ కేసుల సంఖ్య ఎక్కువగా ఉంది.