శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 31 అక్టోబరు 2020 (14:56 IST)

లాక్ డౌన్.. పారిస్‌లో ఎటు చూసినా కార్ల లైట్లే.. హారన్ల మోతే..!

Paris
కరోనా వైరస్ నేపథ్యంలో విధించిన లాక్ డౌన్ భారీ ట్రాఫిక్‌కు కారణమైంది. ఫ్రాన్స్‌ రాజధాని పారిస్‌లో గురువారం రాత్రి నాటి పరిస్థితి ఇది.. ఎటు చూసినా కార్ల లైట్లే.. ఎక్కడ విన్నా హారన్ల మోతే. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా పారిస్‌ చుట్టూ 700 కిలోమీటర్ల మేర భారీ ట్రాఫిక్‌ జామ్‌ అయ్యింది. కోవిడ్‌ మహమ్మారి మళ్లీ విజృంభించడంతో అక్కడ మరోసారి లాక్‌డౌన్‌ విధించడమే ఇందుకు కారణం.
 
శుక్రవారం నుంచి ఫ్రాన్స్‌లో లాక్‌డౌన్‌ నిబంధనలు అమల్లోకి వచ్చాయి. దీంతో గురువారం సాయంత్రం నుంచే దేశంలోని ప్రధాన నగరాల్లో నివసించే ప్రజలు తమ స్వస్థలాలు బయల్దేరారు. ఇంకేముంది నగరాల వెలుపలకు దారితీసే రహదారులన్నీ కార్లు, వాహనాలతో కిటకిటలాడాయి.
 
వేల సంఖ్యలో వాహనాలు ఒకేసారి రోడ్డు మీదకు రావడంతో వందల కిలోమీటర్ల మేర ట్రాఫిక్‌ స్తంభించిపోయింది. గురువారం రాత్రి పారిస్‌ నగరం చుట్టూ దాదాపు 700 కిలోమీటర్ల మేర ట్రాఫిక్‌ నిలిచిపోయినట్లు ఫ్రాన్స్‌ స్థానిక మీడియా తెలిపింది. ఇందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలను పలువురు నెటిజన్లు సోషల్‌మీడియాలో పోస్ట్‌ చేశారు. ఈ ఫోటోలు ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి. 
 
ఈ ఏడాది మార్చిలోనూ పారిస్‌లో ఇలాంటి పరిస్థితే ఏర్పడింది. ఫ్రాన్స్‌లో తొలిసారిగా లాక్‌డౌన్‌ విధించిన సమయంలో పారిస్‌ నుంచి దాదాపు 12లక్షల మంది తమ స్వస్థలాలకు వెళ్లిపోయారు. నగర జనాభాలో దాదాపు ఐదో వంతు ఖాళీ అయ్యింది. అప్పుడు కూడా ఇలాగే ట్రాఫిక్‌ సమస్యలు తలెత్తాయి. నెలక్రితం వరకు ఫ్రాన్స్‌లో కరోనా కాస్త తగ్గుముఖం పట్టినట్లే కన్పించినా.. గత కొన్ని రోజులుగా మళ్లీ ఉగ్రరూపం దాల్చింది. గురువారం ఒక్కరోజే 47వేలకు పైగా కేసులు వెలుగుచూశాయి. దీంతో ఆందోళనకు గురైన ఆ దేశం మళ్లీ లాక్‌డౌన్‌ విధించింది.