శుక్రవారం, 27 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరోనా
Written By సెల్వి
Last Updated : శనివారం, 31 అక్టోబరు 2020 (11:33 IST)

అమెరికాలో విజృంభిస్తున్న కరోనా కేసులు.. 2 రోజులకే 90వేల కేసులు

అమెరికాలో కరోనా కేసులు మళ్లీ విజృంభిస్తున్నాయి. అమెరికాలో కరోనా కేసులు మునుపెన్నడూ లేని స్థాయిలో నమోదవుతున్నాయి. జులై-ఆగస్టులో తీవ్రరూపం దాల్చిన మహమ్మారి.. మళ్లీ ఇప్పుడు అంతకంటే భారీ స్థాయిలో విజృంభిస్తోంది. గత రెండు రోజులుగా 90 వేలకు పైగా కేసులు నమోదవుతుండడం అక్కడి తీవ్రతను తెలియజేస్తోంది. దాదాపు 24 రాష్ట్రాలు తీవ్ర గడ్డు పరిస్థితులు ఎదుర్కొంటున్నాయి.
 
ఇందులో భాగంగా శుక్రవారం 97,080 కొత్త కేసులు నమోదయ్యాయి. దీంతో దేశంలో మొత్తం కేసుల సంఖ్య 90,36,850కి చేరింది. క్రితం రోజుతో పోలిస్తే ఈ సంఖ్య భారీగా పెరగడం గమనార్హం. ఇక శుక్రవారం కొత్తగా 933 మంది మహమ్మారికి బలయ్యారు. దీంతో మృతుల సంఖ్య 2,29,594కు పెరిగింది.
 
ప్రపంచంలోనే అత్యధిక కొవిడ్‌ కేసులు, మరణాలు సంభవించిన దేశం అమెరికానే. దాదాపు 24 రాష్ట్రాల్లో వ్యాధి తీవ్రత ఆందోళనకరంగా ఉంది. దేశంలో ఏ రాష్ట్రంలోనూ కరోనా విషయంలో పురోగతి కనిపిస్తున్న దాఖలాలు లేకపోవడం ఆందోళన కలిగిస్తోంది. కేసుల సంఖ్యలో ఇప్పటి వరకు తొలిస్థానంలో ఉన్న కాలిఫోర్నియాను టెక్సాస్‌ రెండో స్థానానికి నెట్టింది. మూడో స్థానంలో ఫ్లోరిడా కొనసాగుతోంది.