మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. బిబిసి తెలుగు
Written By బిబిసి
Last Modified: శనివారం, 31 అక్టోబరు 2020 (11:21 IST)

చంద్రబాబు: ఆంధ్రప్రదేశ్ మాజీ సీఎంపై ఉన్న కేసులేంటి? వైఎస్సార్ తన పిటిషన్లను ఎందుకు ఉపసంహరించుకున్నారు?

ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు అక్రమ ఆస్తుల కేసుపై హైదరాబాద్‌లోని ఏసీబీ కోర్టులో విచారణ కొనసాగుతోంది. 2005లో ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు భార్య లక్ష్మీపార్వతి ఏసీబీ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. నారా చంద్రబాబు నాయుడు 1978లో తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచిన నాటి నుంచి ముఖ్యమంత్రి అయిన తరువాత వరకు సంపాదించిన ఆస్తులు ఆదాయానికి మించి ఉన్నాయని ఆమె ఆరోపించారు.

 
ఆ అస్తుల పై ఏసీబీ విచారణకు ఆదేశించాలని కోరుతూ పిటిషన్ దాఖలు చేశారు. 2005 మార్చి 14న ఏసీబీ కోర్టు దీనిపై ఏసీబీ విచారణకు ఆదేశించింది. విచారణపై స్టే కోరుతూ చంద్రబాబు నాయుడు అప్పటి ఆంధ్రప్రదేశ్ హైకోర్టును ఆశ్రయించారు. ఏసీబీ కోర్టు విచారణ కోసం జారీ చేసిన ఉత్తర్వులపై స్టే ఆర్డర్ జారీ చేసింది హైకోర్టు. స్టే ఆర్డరు కొట్టివేయాలని లక్ష్మీపార్వతి 2005 ఏప్రిల్‌లో దాఖలు చేసిన పిటిషన్లను హైకోర్టు తిరస్కరించింది. 2011 ఆగస్ట్‌లో తన పిటిషన్ వినాలని కోరుతూ లక్షీపార్వతి మళ్లీ హైకోర్టును ఆశ్రయించారు. అది పెండింగ్‌లో ఉంది.

 
ఆ స్టే ఆర్డర్లు రద్దు
ఆరు నెలల్లోపు పొడిగింపు ఉత్తర్వులు రాని స్టే ఆర్డర్లను రద్దు చేస్తూ 2018 మార్చి 28న సుప్రీం కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. దేశవ్యాప్తంగా ట్రయల్ కోర్టుల్లో, ముఖ్యంగా అవినీతి నిరోధక చట్టం కింద నమోదు చేసిన కేసుల్లో విచారణ ప్రక్రియ ముందుకు సాగడానికి స్టే ఆర్డర్లు అడ్డంకిగా ఉన్నాయని సుప్రీం కోర్టు భావించింది. దీంతో చంద్రబాబు నాయుడు అక్రమ ఆస్తుల కేసు విచారణలో హైకోర్టు ఇచ్చిన స్టే రద్దయింది.14 ఏళ్ల అనంతరం 2019 నవంబర్‌లో మళ్లీ ఏసీబీ కోర్టులో ఈ కేసు విచారణ ప్రారంభమైంది. అయితే, ఈ కేసుపై తుది ఉత్తర్వులు  జారీ కావాల్సి ఉందని.. ఇంకా వాయిదాలు పడుతోందని, తాజాగా నవంబరు 24న తదుపరి వాయిదా ఉందని లక్ష్మీపార్వతి తరఫు న్యాయవాది తెలిపారు.

 
చంద్రబాబు ఆస్తులపై విచారణ కోరుతూ 13 పిటిషన్లు వేసిన వైఎస్ఆర్
చంద్రబాబు నాయుడు ఆస్తులపై విచారణ జరపాలని కోరుతూ 1999 నుంచి 2004 మధ్య కాలంలో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి 13 పిటిషన్‌లు దాఖలు చేశారు. 1999 జూన్ 5న వైఎస్ రాజశేఖర్ రెడ్డి, మరికొందరు రాజకీయ నాయకులు కలిసి అప్పటి గవర్నర్‌కు ఒక నివేదిక సమర్పించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు అప్పటికి ముఖ్యమంత్రిగా ఉన్న నారా చంద్రబాబునాయుడు ఆదాయానికి మించిన ఆస్తులు సంపాదించారని, అవినీతి నిరోధక చట్టం కింద విచారణకు గవర్నర్ ఆదేశించాలని కోరారు.

 
ఇదే అంశంపై పిటిషన్ కూడా దాఖలు చేశారు. అయితే ఈ పిటిషన్ చెల్లదంటూ కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. అనంతరం 2000 సంవత్సరంలో ఇదే పిటిషన్‌పై సుప్రీంకోర్టులో సివిల్ అప్పీల్ దాఖలు చేశారు వైఎస్ రాజశేఖరరెడ్డి. సుప్రీంకోర్టు ఈ పిటిషన్ డిస్మిస్ చేస్తూ 2008 అక్టోబర్ 28న ఉత్తర్వులు జారీ చేసింది.

 
చంద్రబాబుపై పిటిషన్లను ఉపసంహరించుకున్న వైఎస్ రాజశేఖరరెడ్డి
1999, ఆగస్టు 13న చంద్రబాబు ఆస్తులపై సీబీఐ విచారణ కోరుతూ వైఎస్ఆర్ ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. అయితే, 2000 సంవత్సరం డిసెంబరు 12న ఈ పిటిషన్‌ను ఆయన ఉపసంహరించుకున్నారు. 1999 సెప్టెంబరులో హైకోర్టులో ఏడు పిటిషన్లను దాఖలు చేశారు. వాటిని కూడా 2000, డిసెంబర్ 12న వైఎస్ఆర్ ఉపసంహరించుకున్నారు.

 
2000లో
హెరిటేజ్ ఫుడ్స్ కంపెనీ తప్పుడు లావాదేవీల ప్రకటనలు చేశారంటూ, ఆస్తుల వెల్లడించడంలో అవకతవకలు జరిగాయని ఆరోపిస్తూ 2000 సంవత్సరంలో మరో పిటిషన్ దాఖలు చేశారు వైఎస్ఆర్. సీబీఐ దర్యాప్తు చేయాలంటూ ఆ పిటిషన్‌లో కోరారు. 2001 నవంబర్ 10న డివిజన్ బెంచ్ దీన్ని కొట్టివేసింది. ప్రజా ప్రయోజనాల పేరుతో దీనిపై సీబీఐ విచారణకు ఆదేశించలేమని డివిజన్ బెంచ్ ఆ సందర్భంగా అభిప్రాయపడింది.

 
చంద్రబాబు నాయుడు, ఆయన కుటుంబసభ్యుల ఆస్తులపై విచారణ జరపాలని కేంద్ర విజిలెన్స్ కమిషన్‌ను కోరుతూ 2001లో దిల్లీ హైకోర్టులో పిటిషన్ వేశారు వైఎస్ఆర్. సాక్ష్యాధారాలు లేనందున 2001 మార్చి 29న దీన్ని కొట్టివేసింది దిల్లీ హైకోర్టు.

 
2003లో..
2003 మార్చిలో చంద్రబాబునాయుడు, ఆయన కుటుంబసభ్యుల ఆస్తులపై సీబీఐ విచారణ కోరుతూ వైఎస్ రాజశేఖరరెడ్డి సుప్రీంకోర్టులో రెండు పిటిషన్లు దాఖలు చేశారు. అనంతరం ఆంధ్రప్రదేశ్ హైకోర్టును ఆశ్రయించాలని భావించి ఆ పిటిషన్లను ఉపసంహరించుకోవడంతో కోర్టు వాటిని 2004 ఏప్రిల్‌లో డిస్మిస్ చేసింది.

 
2004లో కన్నా లక్ష్మీనారాయణ
2004 నాటికి కాంగ్రెస్ పార్టీలో ఉన్న ప్రస్తుత బీజేపీ నేత కన్నా లక్ష్మీనారాయణ చంద్రబాబునాయుడు, ఆయన కుటుంబసభ్యుల ఆస్తులపై సీబీఐ విచారణ కోరుతూ హైకోర్టులో పిటిషన్ వేశారు.

 
'కన్నా' పిటిషన్‌లో ఆరోపణలు
చంద్రబాబు తన స్వలాభం కోసం హైదరాబాద్‌లోని మాదాపూర్ వద్ద  500 ఎకరాల విలువైన ప్రభుత్వ భూమిని ఎల్ అండ్ టీ కంపెనీకి అతి చవక ధరకే ఇచ్చారని కన్నా లక్ష్మీనారాయణ తన పిటిషన్‌లో ఆరోపించారు.

 
టెండర్లు పిలవకుండా రూ .1400 కోట్ల కాంట్రాక్టులను ఎల్ అండ్ టీ సంస్థ కు మంజూరు చేశారని ఆయన ఆరోపించారు. బదులుగా ఎల్ అండ్ టీ కంపెనీ ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్‌ను ఉచితంగా నిర్మించి ఇచ్చిందని ఆరోపించారు. ఏపీఐఐసీకి చెందిన 158 ఎకరాల్లో 76 ఎకరాలు ఎల్ అండ్ టీ సంస్థ కు చవక ధరకు ఇవ్వడం కారణంగా అప్పటి ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రానికి రూ. 125 కోట్ల నష్టం వాటిల్లిందని ఆరోపించారు. 1989 నుంచి 1994 మధ్య కాలంలో వ్యవసాయం వచ్చిన రాబడే తన ఆదాయంగా చూపించిన చంద్రబాబు ఆదాయం ఏప్రిల్ 1999 నాటికి రూ.19 కోట్లుగా ఎలా అయ్యిందని ప్రశ్నించారు.

 
1988 జూన్‌లో ఓ పిటిషన్‌కు సమాధానంగా వ్యవసాయంపై తనకు రూ.36 వేల ఆదాయం వస్తున్నట్లు‌గా అఫిడవిట్ దాఖలు చేశారు చంద్రబాబు. అక్టోబర్ 1994 లో తాను మేనేజింగ్ డైరెక్టర్‌గా ఉన్న హెరిటేజ్ ఫుడ్ కంపెనీకి తనకు ఎటువంటి లావాదేవీలు లేవంటూ హైదరాబాద్‌లో రిజిస్ట్రార్ ఆఫ్ కంపెనీస్‌కు వెల్లడించారు. ఈ వివరాలన్ని ఈ పిటిషన్‌లో పొందుపరిచారు. గతంలో దాఖలు చేసిన పిటిషన్లలోనూ ఈ ఆరోపణలపై వివరాలు అందించారు.

 
గతంలో దాఖలైన పిటిషన్‌లను ప్రస్తావిస్తూ "మళ్ళీ అదే ఆరోపణలపై తాజాగా దాఖలు చేసిన పిటిషన్ సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో చేసినట్టు ఉంది. ఎన్నికల వచ్చే వరకు మౌనంగా ఉండి సరిగ్గా ఎన్నికల ముందు దాఖలు చేసిన పిటిషన్‌ను పరిశీలించడానికి కారణం లేదు. లావాదేవీలపై చేసిన ఆరోపణలపై సంబధిత అధికారులను సంప్రదించకుండా హైకోర్టు ను ఆశ్రయించడంలో కారణం లేదు" అంటూ 2004 జులైలో హైకోర్టు ఆ పిటిషన్‌ను కొట్టివేసింది.

 
2011లో విజయమ్మ పిటిషన్
వైఎస్ రాజశేఖరరెడ్డి సతీమణి వైఎస్ విజయలక్ష్మి 2011లో ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. చంద్రబాబునాయుడు, ఆయన కుటుంబసభ్యుల ఆస్తులు వారి ఆదాయానికి మించి ఉన్నాయని ఆరోపిస్తూ ఆమె పిటిషన్ దాఖలు చేశారు. 1995 నుంచి 2004 మధ్య కాలంలో ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారని ఆమె తన పిటిషన్‌లో ఆరోపించారు.

 
రాష్ట్ర విధానాలను స్వలాభాలకు అనుగుణంగా రూపొందించి పలువురు వ్యాపారవేత్తలకు లాభాలు చేకూర్చారని ఆమె ఆరోపించారు. దీనిపై సీబీఐ విచారణకు ఆదేశించాలని ఆ పిటిషన్‌లో కోరారు. అదే ఏడాది నవంబరు 14న పిటిషన్‌ను స్వీకరించి సీబీఐ విచారణకు ఆదేశిస్తూ హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. విచారణ ఆరు నెలల్లో పూర్తి చేయాలని గడువు విధించింది.

 
అయితే, సీబీఐ విచారణకు జారీ చేసిన హైకోర్టు ఉత్తర్వులను కొట్టివేయాలని చంద్రబాబు నాయుడు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. 2011 నవంబర్ 23న ఆయన పిటిషన్‌ను కోర్టు కొట్టివేస్తూ సీబీఐ విచారణపై స్టే కోరుతూ ఏపీ హైకోర్టులోనే పిటిషన్ దాఖలు చేసుకోవచ్చని సూచించింది సుప్రీంకోర్టు. సీబీఐ విచారణ కు ఆదేశిస్తూ ఇచ్చిన ఉత్తర్వులను 2012 ఫిబ్రవరి 16న హైకోర్టు కొట్టివేసింది. అంతకుముందు 2011 నవంబర్ 14న జారీచేసిన ఉత్తర్వులను ప్రాథమిక సూత్రాల ఉల్లంఘనగా హైకోర్టు పేర్కొంది.

 
పిటిషన్ దాఖలు చేసిన వైఎస్ విజయలక్ష్మి రాజకీయ కారణాలతో పిటిషన్ దాఖలు చేసినట్టుగా ఉందని హైకోర్టు భావిస్తూ కొట్టివేసింది. హైకోర్టు ఆదేశాలను ప్రశ్నిస్తూ వైఎస్ విజయలక్ష్మి సుప్రీంకోర్టును ఆశ్రయించగా హైకోర్టు నిర్ణయంతో ఏకీభవిస్తూ సుప్రీంకోర్టు కూడా ఆ పిటిషన్ కొట్టివేసింది.

 
ఓటుకు నోటు స్కాం
2015 మేలో తెలంగాణ కౌన్సిల్ ఎన్నికలలో తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా ఓటు వేసేందుకు రూ. 5 కోట్లు లంచం ఇవ్వజూపారని ఆరోపిస్తూ ఎల్విస్ స్టీవెన్సన్ ఫిర్యాదు చేశారు. 2015 మే 30న టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు, స్టీవెన్సన్ మధ్య ఫోన్ సంభాషణ అంటూ ఒక ఆడియో టేపు మీడియాకు లీకైంది. ఆ మరుసటి రోజు స్టీవెన్సన్‌కు డబ్బు ఇచ్చేందుకు వెళ్లారంటూ అప్పటి టీడీపి నేత రేవంత్ రెడ్డిని ఏసీబీ అరెస్టు చేసింది.

 
2015 జులై 28న తెలంగాణ అవినీతి నిరోధక శాక దీనిపై హైదరాబాద్ ఏసీబీ కోర్టులో అభియోగ పత్రం దాఖలు చేసింది. అందులో చంద్రబాబునాయుడుని నిందితుడిగా పేర్కొనలేదు. కానీ దాదాపు 22 సార్లు చంద్రబాబు నాయుడు పేరును చార్జిషీట్‌లో ఏసీబీ ప్రస్తావించింది. 2016లో వైఎస్ఆర్‌సీపీ నేత ఆళ్ల రామకృష్ణారెడ్డి దీనిపై ఏసీబీ కోర్టులో ఫిర్యాదు నమోదు చేశారు. ఓటుకు నోటు కేసులో చంద్రబాబునాయుడు పాత్రను విచారించడంలో తెలంగాణ ఏసీబీ విఫలమైందని ఆయన ఆరోపించారు. దీంతో 2016 ఆగస్టులో చంద్రబాబునాయుడు పాత్రపై విచారణ చేయాలంటూ ఏసీబీ కోర్టు అవినీతి నిరోధక శాఖను ఆదేశించింది.

 
ఏసీబీ కోర్టు ఆదేశాలపై హైకోర్టును ఆశ్రయించారు చంద్రబాబు‌నాయుడు. ఏసీబీ విచారణ కోసం ఇచ్చిన ఉత్తర్వులను రద్దు చేస్తూ 2016 డిసెంబర్‌లో హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. దీని పై 2017లో ఆళ్ల రామకృష్ణారెడ్డి సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్‌లు పెండింగ్‌లో ఉన్నాయి.