శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 12 జూన్ 2020 (17:27 IST)

పెరిగిపోతున్న నిరుద్యోగం... హెచ్1బి వీసాల రద్దు దిశగా అడుగులు?

కరోనా వైరస్ మహమ్మారి అమెరికాలో విలయతాండవం చేస్తోంది. ఫలితంగా ఆ దేశంలో నిరుద్యోగం తారా స్థాయికి చేరింది. ఈ నేపథ్యంలో అత్యంత కీలకమైన హెచ్-1బీ సహా, అమెరికాలో విదేశీయులకు లభించే పలురకాల వీసాలను రద్దు చేయాలని ఆ దేశ అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ భావిస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి. 
 
ఈ మేరకు ప్రముఖ వార్తా పత్రిక 'ది వాల్ స్ట్రీట్ జర్నల్' ఓ కథనాన్ని ప్రచురించింది. కరోనా మహమ్మారి కారణంగా దేశంలో లక్షలాది మంది ఉపాధిని కోల్పోగా, ఈ దశలో విదేశాల నుంచి వచ్చే వారికి ఉద్యోగాలు చేసుకునేందుకు అనుమతిస్తే, వ్యతిరేకత పెరుగుతుందని ట్రంప్ భావిస్తున్నట్టు సమాచారం.
 
అందుకే, హెచ్1బీ వీసాలతో పాటు.. విదేశీయులకు ఉపాధి అవకాశాలు కల్పించే ప్రతి ఒక్క వీసాలను రద్దు చేయాలని ఆయన భావిస్తున్నట్టు తెలుస్తోంది. ఇందుకోసం ప్రతిపాదనలు ఇప్పటికే మొదలుకాగా, ఆర్థిక సంవత్సరం మొదలయ్యే అక్టోబరు ఒకటో తేదీలోగా తుది నిర్ణయం తీసుకునే అవకాశాలు ఉన్నట్టు ఆ కథనం పేర్కొంది. 
 
"సస్పెన్షన్‌ను ఎత్తివేసేంత వరకూ హెచ్-1బీ వీసాలను జారీ చేయరాదని ప్రభుత్వం భావిస్తోంది. ఇదే సమయంలో ఇప్పటికే వీసాలను పొంది, అమెరికాలో ఉద్యోగం చేస్తున్న విదేశీయులపై ఎటువంటి ప్రభావమూ ఉండబోదు" అని ఆ అధికారి పేర్కొన్నారని 'ది వాల్ స్ట్రీట్ జర్నల్' పేర్కొంది.