శుక్రవారం, 24 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 5 అక్టోబరు 2020 (10:56 IST)

కోవిడ్ ప్రొటోకాల్స్ బ్రేక్ చేసిన డోనాల్డ్ ట్రంప్.. కారులో చక్కర్లు!

ప్రాణాంతక కరోనా వైరస్ బారినపడిన అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ కోవిడ్ నిబంధనలను యధేచ్చగా బ్రేక్ చేశారు. కోవిడ్ నిబంధనలను ఆయన ఏమాత్రం పాటించకుండా తన కారుల్లో రోడ్లపై రెండు రౌండ్లు వేసి.. ఆ తర్వాత మళ్లీ ఆస్పత్రికి వచ్చారు. 
 
ప్రస్తుతం కరోనా వైరస్ సోకిన ట్రంప్.. వాల్టర్ రీడ్ సైనిక ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న విషయం తెల్సిందే. అయితే, ఆయన తాజాగా చేసిన పనికి తీవ్ర విమర్శలపాలయ్యారు. ప్రస్తుతం చికిత్స పొందుతున్న ఆయన, కొవిడ్-19 ప్రొటోకాల్ నిబంధనలను ఉల్లంఘిస్తూ, బయటకు వచ్చారు. బులెట్ ప్రూఫ్ కారులో రోడ్డుపై కలియ దిరుగుతూ, తన మద్దతుదారులకు అభివాదం చేశారు. 
 
కాసేపు బయట తిరిగిన తర్వాత, ఆయన తిరిగి ఆసుపత్రిలోకి వెళ్లిపోయారు. కరోనా నెగటివ్ రాకుండానే ఆయన ఇలాంటి చర్యలకు దిగడాన్ని వైద్య నిపుణులు ప్రశ్నిస్తున్నారు. శరీరంలో వైరస్ ఉంటే, అది అనుక్షణం బయట వ్యాపిస్తూనే ఉంటుందని, ఈ కారణంగానే రోగులను ఐసోలేట్ చేస్తారని, చికిత్స సమయంలో ఇలా చేయడం సరికాదని అంటున్నారు.
 
కాగా, తాను బయటకు రావడానికి ముందు, ట్విట్టర్ ఖాతాలో మరో వీడియోను పోస్ట్ చేసిన ట్రంప్, "కొవిడ్ గురించి నేను చాలా తెలుసుకున్నాను. నిజంగా స్కూలుకు వెళ్లినట్టుగా ఉంది" అని వ్యాఖ్యానించారు. ట్రంప్ సోషల్ మీడియా స్టంట్‌ను ప్రారంభించారని ఇప్పుడు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
 
ట్రంప్ కారణంగా కాన్వాయ్, సీక్రెట్ సర్వీస్ ఏజంట్లు, సెక్యూరిటీలోని ఎవరైనా అస్వస్థతకు గురై, చనిపోతే జవాబుదారీ ఎవరని, తన రాజకీయ అవసరాలకు ఉద్యోగులను బలిపెట్టడం ఏంటని పలువురు ప్రశ్నిస్తున్నారు. వైట్‌హౌస్ అధికార ప్రతినిధి జూడ్ డీర్ మాత్రం ఈ విమర్శలను ఖండించారు. ట్రంప్‌తో పాటు ఉన్న వారంతా ప్రొటెక్టివ్ గేర్‌ను ధరించే ఉన్నారని, మెడికల్ టీమ్ ఈ పర్యటన సురక్షితమని చెప్పిన తర్వాతనే ఆయన బయటకు వచ్చారని అన్నారు.