శుక్రవారం, 24 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : ఆదివారం, 4 అక్టోబరు 2020 (12:03 IST)

నా భవిష్యత్‌కు నిజమైన పరీక్ష ఇది.. విజయం సాధిస్తా : డోనాల్డ్ ట్రంప్

నా భవిష్యత్‌కు ఇది నిజమైన పరీక్ష ఇది. ఈ పరీక్షలో విజయం సాధించి తప్పక తిరిగివస్తానంటూ కరోనా వైరస్ బారినపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ వ్యాఖ్యానించారు. ఆయన శనివారం తన ఆరోగ్యానికి సంబంధించిన విషయాలను ట్విట్టర్‌ వీడియో ద్వారా పంచుకున్నారు.
 
"నేను ఇక్కడికి రావడం ఏమంత మంచిగా అనిపించడం లేదు. ప్రస్తుతం కొంచెం ఫర్వాలేదు. త్వరలోనే బయటకు వచ్చి, నేను ప్రారంభించిన ఎన్నికల ప్రచారాన్ని ముగిస్తాననే భావిస్తున్నాను. రానున్న రెండు రోజుల్లో ఏం జరుగుతుందో చూడాలి" అని ఆయన అన్నారు.
 
'నన్ను తిరిగి ఆరోగ్యవంతుడిగా మార్చేందుకు అందరూ బాగా కృషి చేస్తున్నారు. అమెరికాను మరోసారి అగ్రస్థానంలో నిలిపేందుకు తాను తప్పక తిరిగిరావాల్సి ఉంది' అని వ్యాఖ్యనించారు. కరోనా వైరస్‌ను తాము జయించబోతున్నామని, రాబోయే రోజుల్లో ఏం జరుగుతుందో చూడటమే నిజమైన పరీక్ష అని చెప్పారు. 
 
కాగా, ఈ వీడియో భారత కాలమానం ప్రకారం, ఆదివారం తెల్లవారుజామున విడుదల కాగా, దీన్ని ముందుగానే చిత్రీకరించారా? లేదా వాల్టర్ రీడ్ ఆసుపత్రిలో చేరిన తర్వాత షూట్ చేశారా? అన్న విషయమై స్పష్టత లేదు. ఈ వీడియోలో ట్రంప్ బాగానే కనిపిస్తున్నారు. గొంతు మాత్రం కాస్తంత తేడాగా ఉన్నట్టు తెలుస్తోంది. వైట్ డ్రస్‌పై నీలి రంగు బ్లేజర్ వేసుకుని ట్రంప్ కనిపించారు. ప్రస్తుతం తాను ఆసుపత్రి నుంచి పనిచేయడం మినహా మరేమీ చేయలేనని ట్రంప్ వ్యాఖ్యానించారు.
 
మరోవైపు, ట్రంప్ ఆరోగ్య పరిస్థితిపై స్పందించిన వైట్ హౌస్ ఫిజీషియన్ సీన్ కాన్లీ, ట్రంప్‌కు గత 24 గంటలుగా జ్వరం రాలేదని, అయితే, దగ్గు, జలుబు మరింతగా పెరిగాయని, ఒంట్లో నీరసం కూడా అధికమైందన్నారు. ట్రంప్ తన రోజువారీ పాలనా వ్యవహారాలను చూసుకునేందుకు ఆసుపత్రిలో ఓ సూట్‌ను సిద్ధం చేసి, అక్కడ అన్ని రకాల సమాచార సాధనాలనూ ఏర్పాటు చేశారు. వైట్‌హౌస్‌కు ప్రత్యామ్నాయంగా ఈ సూట్ ఉంటుందని, ఇక్కడి నుంచే అన్ని పనులనూ తాను చక్కబెట్టగలనని ట్రంప్ వ్యాఖ్యానించారు.