మంగళవారం, 23 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరోనా
Written By ఠాగూర్
Last Updated : ఆదివారం, 4 అక్టోబరు 2020 (10:11 IST)

దేశంలో కరోనా మృతులు లక్ష : మొత్తం కేసులు 65 లక్షలు

దేశంలో కరోనా వైరస్ వ్యాప్తి తగ్గడం లేదు. ముఖ్యంగా ఈ వైరస్ బారినపడి ప్రాణాలు కోల్పోతున్న వారి సంఖ్య లక్ష దాటిపోయింది. అలాగే గడచిన 24 గంటల్లో 75,829 మందికి కరోనా నిర్ధారణ అయిందని కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ పేర్కొంది. దీంతో దేశంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 65,49,374కి చేరింది.
 
గ‌త 24 గంట‌ల సమయంలో 940 మంది కరోనా కారణంగా మృతి చెందారు. దీంతో మృతుల సంఖ్య 1,01,782 కి పెరిగింది. దేశంలో కరోనా నుంచి ఇప్పటివరకు 55,09,967 మంది కోలుకున్నారు. 9,37,625 మందికి ప్రస్తుతం ఆసుపత్రులు, హోం క్వారంటైన్‌లలో చికిత్స అందుతోంది.
 
కాగా, దేశంలో శనివారం వరకు మొత్తం 7,89,92,534 కరోనా పరీక్షలు నిర్వహించినట్లు భారతీయ వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్) తెలిపింది. నిన్న ఒక్కరోజులోనే 11,42,131 శాంపిళ్లను పరీక్షించినట్లు పేర్కొంది.
 
మరోవైపు, గత కొన్ని రోజులుగా తెలంగాణ రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. గడచిన 24 గంటల్లో 51,623 మంది నమూనాలను పరీక్షించగా, 1,949 మందికి వైరస్ సోకినట్టు నిర్దారణ అయింది. దీంతో మొత్తం కేసుల సంఖ్య 1,99,276కు చేరుకుంది. 
 
రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ఆదివారం ఉదయం విడుదల చేసిన గణాంకాల మేరకు శనివారం నాడు కరోనాతో 10 మంది మరణించగా, మొత్తం మృతుల సంఖ్య 1,163కు చేరింది. శనివారం నాడు వ్యాధి నుంచి 2,366 మంది కోలుకోగా, మొత్తం కోలుకున్న వారి సంఖ్య 1,70,212కు చేరింది.
 
ప్రస్తుతం రాష్ట్రంలో 27,901 యాక్టివ్ కేసులు ఉండగా, వీరిలో 22,816 మంది హోమ్ ఐసోలేషన్ లో ఉంచి వైద్యుల సలహాతో చికిత్స తీసుకుంటున్నారని అధికారులు వెల్లడించారు. ఇక, ఇప్పటివరకూ రాష్ట్రంలో 32 లక్షలకు పైగా కరోనా టెస్ట్ లను నిర్వహించామని ఆరోగ్య శాఖ ప్రకటించింది. కొత్తగా వచ్చిన కేసుల్లో జీహెచ్ ఎంసీ పరిధిలో 291 కేసులు ఉండటం గమనార్హం.