ఢాకా అల్లర్ల కేసులో షేక్ హసీనాకు మరణదండన
బంగ్లాదేశ్ అల్లర్ల కేసులో ఆ దేశ మాజీ ప్రధాని షేక్ హసీనాకు మరణశిక్ష విధిస్తూ ఇంటర్నేషనర్ క్రైమ్స్ ట్రైబ్యునల్ కోర్టు సంచలన తీర్పును వెలువరించింది. మానవత్వానికి వ్యతిరేకంగా నేరాలకు పాల్పడ్డారన్న అభియోగాల నేపథ్యంలో ఆమెపై అనేక కేసులు నమోదైవున్నాయి.
ఈ కేసుల్లో వాదనలు ఆలకించిన ఇంటర్నేషనల్ క్రైమ్స్ ట్రైబ్యునల్ సోమవారం ఆమెను దోషిగా తేల్చింది. గత ఏడాది జులై - ఆగస్టుల్లో జరిగిన ఆందోళనల్లో 1400 మృతి చెందారని ఐసీటీ న్యాయమూర్తి వెల్లడించారు. తనకు వ్యతిరేకంగా నిరసన చేస్తున్న వారిని చంపేయమని ఆమె ఆదేశాలు ఇచ్చారని పేర్కొన్నారు.
ఆగస్టు 5న ఢాకాలో నిరసనకారులపై ఆర్మీ కాల్పులు జరిపిందని, వారిపై హెలికాప్టర్లు, ప్రాణాంతక ఆయుధాలు ఉపయోగించాలని ఆమె ఆదేశించారని మరో న్యాయమూర్తి తీర్పులో ప్రస్తావించారు. ఈ మేరకు దర్యాప్తు నివేదికను చదివి వినిపించారు.
గాయపడినవారికి వైద్యం అందించేందుకు నిరాకరించారన్నారు. ఆమె అధికారంలో ఉండేందుకు బలప్రయోగం చేశారని పేర్కొన్నారు. తీర్పు ఇవ్వడంలో ఏదైనా ఆలస్యం జరిగితే క్షమించాలన్నారు. ఇక తీర్పు నేపథ్యంలో ఐసీటీ చుట్టూ భద్రతను కట్టుదిట్టం చేశారు.
కాగా, ఈ తీర్పు నేపథ్యంలో బంగ్లాదేశ్ వ్యాప్తంగా ముఖ్యంగా రాజధాని నగరం ఢాకాలో హై అలర్ట్ ప్రకటించారు. ఎవరైనా వాహనాలు తగలబెట్టేందుకు, బాంబులు విసిరేందుకు ప్రయత్నిస్తే.. వారిని కాల్చివేయాలంటూ ఢాకా పోలీస్ చీఫ్ షేక్ మహమ్మద్ సజ్జత్ అలీ ఆదేశాలు ఇచ్చారు.