మంగళవారం, 7 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 11 జనవరి 2024 (09:22 IST)

ఆ దేశంలో నైట్రోజన్ గ్యాస్‌తో మరణశిక్ష అమలు.... ఎక్కడ?

death penality
అగ్రరాజ్యం అమెరికాలోని ఓ రాష్ట్రం వివిధ నేరాలకు పాల్పడిన ఉరిశిక్ష పడిన ఖైదీలకు శిక్షలు అమలు చేసే విషయంలో కొత్త పద్ధతులను అమలు చేస్తున్నారు. భారత్ వంటి దేశాల్లో ఉరి వేయడం ద్వారా ఈ శిక్షలను అమలు చేస్తున్నారు. అయితే, అమెరికాలో మాత్రం ప్రాణాంతక ఇంజెక్షన్లు ఇవ్వడం ద్వారా ముద్దాయిలకు ఉరిశిక్షలను అమలు చేస్తున్నారు. తాజాగా అమెరికాలోని అలబామా రాష్ట్రం ఇంకో సరికొత్త పద్ధతిలో ఈ శిక్షను అమలు చేయనుంది. ప్రాణాంత ఇంజెక్షన్లు లభించకపోవడంతో నెట్రోజన్ గ్యాస్‌ను ఉపయోగించి ఈ శిక్షను అమలు చేయనున్నారు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, 
 
నైట్రోజన్ గ్యాస్‌ను పీల్పించడం ద్వారా మరణశిక్షను అమలు చేయబోతున్నారు. ఈ మేరకు అలబామా రాష్ట్ర అధికారులకు యూఎస్ ఫెడరల్ జడ్జి అనుమతి ఇచ్చారు. 1988లో కిరాయి హత్యకు పాల్పడిన కెన్నెత్ స్మిత్ అనే వ్యక్తికి ఈ విధానంలో మరణదండన విధించనున్నారు. జనవరి 25న అలబామాలో శిక్షను అమలుచేయనున్నారు. అయితే నైట్రోజన్ గ్యాస్ ద్వారా మరణశిక్ష విధించడాన్ని సవాలు చేస్తూ దోషి కెన్నెత్ స్మిత్ కోర్టులో పిటిషన్ వేయగా దానిని ఫెడరల్ జడ్జి తోసిపుచ్చారు. 
 
ప్రతిపాదిత పద్ధతిలో మరణశిక్ష ప్రమాదకరమైనదని, ముఖానికి ధరించే మాస్క్ పగిలిపోయి ఆక్సిజన్ లోపలి వస్తే శరీర భాగాలు దెబ్బతిని దీర్ఘకాలంపాటు అచేతనంగా పడి ఉంటుందని అభ్యంతరం తెలిపాడు. మరణశిక్షను నిలిపివేయాలని కోరాడు. ఈ మేరకు అలబామా డిపార్ట్‌మెంట్ ఆఫ్ కరెక్షన్స్‌పై కెన్నెత్ దావా వేయగా జడ్జి కొట్టివేశారు. నైట్రోజన్ గ్యాస్ ద్వారా ఉరిశిక్షను కొనసాగించవచ్చునని అలబామాలోని మోంట్ గోమెరీ యూఎస్ డిస్ట్రిక్ట్ కోర్ట్ జడ్జి ఆర్ ఆస్టిన్ బుధవారం ఈ తీర్పు ఇచ్చారు. ఈ పద్ధతి క్రూరమైనదని, అసాధారణమైన శిక్ష అని ఖైదీ చెప్పలేరని న్యాయమూర్తి వ్యాఖ్యానించారు. స్మిత్కు వ్యతిరేకంగా తీర్పు ఇచ్చారు.
 
కాగా ఈ పద్ధతిలో ఖైదీ ముఖానికి మాస్క్‌ని కట్టి నైట్రోజన్ గ్యాస్‌ని వదులుతారు. ఆక్సిజన్ అందక ప్రాణాలు కోల్పోవాల్సి ఉంటుంది. ఇదిలావుంచితే.. అమెరికా రాష్ట్రాలు ఉరిశిక్షలో ఉపయోగించే ప్రాణాంతక లెథల్ ఇంజెక్షన్లను ప్రొటోకాల్ ప్రకారం పొందడం చాలా సంక్లిష్టంగా మారింది. మరణశిక్షల్లో వాడే ఔషధాలను విక్రయించొద్దని కంపెనీలపై యూరోపియన్ యూనియన్ నిషేధం విధించడం ఇందుకు కారణమైంది. దీంతో అమెరికాలోని కొన్ని రాష్ట్రాలు ఫైరింగ్ స్క్వాడ్ వంటి పాత పద్ధతులను పునరుద్ధరించాలని నిర్ణయించాయి. ఇక అలబామా, మిస్సిస్సిప్పి, ఓక్లహామా రాష్ట్రాలు కొత్త గ్యాస్ ఆధారిత విధానాన్ని ప్రవేశపెట్టాయి. కాగా జడ వాయువు ద్వారా ఊపిరాడకుండా చేసి మరణశిక్ష విధించడం హింస అని, క్రూరమైన అమానవీయమైన శిక్ష అని ఐక్యరాజ్యసమితి నిపుణులు గత వారమే హెచ్చరించారు.