అవకాశం వస్తే మళ్లీ స్టార్‌లైనర్‌లో ఐఎస్ఎస్‌లోకి వెళ్తా : సునీతా విలియమ్స్ (Video)
భారత సంతతికి చెందిన సునీతా విలియమ్స్‌తో సహా మరో వ్యోమగామి బుచ్ విల్మోర్‌లు దాదాపు తొమ్మిది నెలల తర్వాత భూమిపైకి వచ్చారు. పుడమికి చేరుకున్న తర్వాత తొలిసారి విలేకరుల ముందుకు వచ్చారు. ఈ సందర్బంగా నాసా నిర్వహించిన ప్రెస్ కాన్ఫరెన్స్‌లో సునీతా, బుచ్ విల్మోర్, నిక్ హేగ్ మాట్లాడారు. తనకు ఇపుడు బాగానే ఉందని సునీత చెప్పుకొచ్చారు.
ఈ సందర్భంగా మీడియా అడిగిన ప్రశ్నకు సునీత సమాధానమిస్తూ, అవకాశం మళ్లీ వస్తే స్టార్ లైనర్‌లో ఐఎస్ఎస్‌కు వెళ్తామని, అది చాలా సామర్ధ్యం గల వాహకనౌక అని చెప్పారు. అయితే, అందులో కొన్ని సాంకేతిక సమస్యలు ఉన్నాయని, వాటిని సరిచేయాల్సి అవసరం ఉందన్నారు. తాను భూమిపైకి వచ్చాక ఇప్పటికే మూడు మైళ్లు పరుగెత్తానని తెలిపారు. తాను మళ్లీ సాధారణ స్థితికి రావడాని సహాయం చేసిన ట్రైనర్లరకు సునీతా విలియమ్స్ ధన్యవాదాలు తెలిపారు. ఐఎస్ఎస్‌లో ఉన్న సమయంలో తమ టాస్క్‌ల్లో భాగంగా ఎన్నో సైన్స్ ప్రయోగాలు చేపట్టామని, శిక్షణ పొందామని వెల్లడించారు.
ఇక ఐఎస్ఎస్‌లో ఉన్నపుడు తన ఆరోగ్యం గురించి చాలా మంది ఆందోళనకు గురైన విషయం తనకు తెలుసున్నారు. అయితే, తాము ఒక పెద్ద టీమ్ ప్రయత్నంలో భాగమైనవున్నట్టు తెలిపారు. అంతరిక్షం నుంచి భూమిపైకి వచ్చాక శరీరంలో కొన్ని మార్పులు ఉంటాయని, అందుకు తగ్గట్లు కొన్ని సర్దుబాట్లు అవసరమన్నారు. అయితే, తాము కోలుకోవడంలో సహాయ బృందాలు ఎంతో కృషి చేస్తున్నట్టు చెప్పారు. తాము భూమిపైకి దిగిన దగ్గర నుంచి బలాన్ని తిరిగి పొందడానికి సహాయ బృందాలు ఎంతో కృషి చేస్తున్నాయని వెల్లడించారు.