బుధవారం, 27 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By ఎం
Last Updated : గురువారం, 21 జనవరి 2021 (09:43 IST)

అమెరికా మాజీ అధ్యక్షుడు ట్రంప్‌ కొత్త పార్టీ?

అమెరికా మాజీ  అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ సొంతంగా పార్టీ పెట్టే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. తన ఓటమిని అంగీకరించని ట్రంప్‌...నూతనాధ్యక్షుడు జో బైడెన్‌ ప్రమాణ స్వీకారానికి హాజరు కాలేదు.

ఈ క్రమంలో ఆయన సొంత పార్టీ పెట్టాలని నిర్ణయించుకున్నారని సమాచారం. పేట్రియేట్‌ అనే పేరుతో పార్టీ ఏర్పాటు చేసి..మద్దతు దారులను కూడగట్టాలన్న యోచనలో ఆయన ఉన్నట్లు తెలుస్తోంది.

ప్రస్తుతం క్యాపిటల్‌ భవనంపై దాడి నేపథ్యంలో తనపై ప్రతికూలత నెలకొన్న నేపథ్యంలో కాస్తా పరిస్థితులు చక్కదిద్దుకున్నాక..పార్టీ పేరును ప్రకటించాలని ట్రంప్‌ భావిస్తున్నట్లు డెయిలీ మెయిల్‌ ఓ కథనాన్ని ప్రచురించింది.

కాగా, వైట్‌ హౌస్‌ను వీడే సమయంలో తన చివరి సందేశాన్నిచ్చిన ట్రంప్‌..తాను మరల వైట్‌ హౌస్‌కు వస్తానంటూ వ్యాఖ్యానించిన సంగతి విదితమే. దేశం కోసం శ్రమించేందుకు లక్షలాది మంది ఉన్నారని, మనమంతా కష్టించి దేశ చరిత్రలోనే ఓ గొప్ప రాజకీయ ఉద్యమాన్ని చేపట్టామని,. ఈ ఉద్యమం అంతం కాదు. ఆరంభం మాత్రమే' అంటూ ట్వీట్‌ చేశారు.

కఠినమైన నిర్ణయాలు, తీవ్ర పోరాటాలెన్నో చేశానని, మీ అవసరాలే తన మొదటి ప్రాధాన్యంగా భావిస్తానని అన్నారు. అదేవిధంగా వీడ్కోలు సందేశంలో కూడా కొత్త పాలక బృందానికి శుభాకాంక్షలు తెలిపారు. ఆ ప్రసంగం మొత్తంలో కనీసం బైడెన్‌ పేరు ఎత్తనే లేదు.

అమెరికా సుభిక్షంగా, భద్రంగా ఉంచడంలో కొత్త బృందానికి శుభాకాంక్షలను తెలియజేస్తూ...వారికి అదృష్టం కూడా కలిసి రావాలని కోరుకుంటున్నట్లు చెప్పారు. అదే విధంగా తన హాయాంలో సాధించిన కొన్ని విజయాలను వల్లె వేసుకున్నారు.