బుధవారం, 25 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఎం
Last Updated : శనివారం, 9 జనవరి 2021 (20:01 IST)

పూర్తి సమయం వెచ్చించే ప్రజాప్రతినిధులు కావాలి: ఉపరాష్ట్రపతి

ప్రజాస్వామ్యంలో చట్టసభల ప్రాముఖ్యత అత్యంత కీలకమని గౌరవ ఉపరాష్ట్రపతి, రాజ్యసభ చైర్మన్ శ్రీ ముప్పవరపు వెంకయ్యనాయుడు పేర్కొన్నారు. చట్టసభలు, ఈ సభ సభ్యులు ఎంత న్యాయబద్ధంగా వ్యవహరిస్తున్నారనేది పార్లమెంటరీ వ్యవస్థ పనితీరును, సమర్థతను ప్రతిబింబిస్తాయన్న ఆయన... దీంతోపాటుగా చట్టసభలపై ప్రజలకు విశ్వాసం పెరుగుతుందని పేర్కొన్నారు. లేని పక్షంలో ప్రజల్లో ప్రజాప్రతినిధులపై నమ్మకం తగ్గిపోతుందని ఆయన అభిప్రాయపడ్డారు.
 
గోవా శాసనసభ్యుల దినోత్సవం సందర్భంగా పణజీలో ఏర్పాటుచేసిన కార్యక్రమంలో పాల్గొన్న ఉపరాష్ట్రపతి, రాజకీయాలు, ప్రజలకు ప్రాతినిధ్యం వహించడం పార్ట్ టైమ్ సేవ కాదనే విషయాన్ని ప్రతి ఒక్కరూ గుర్తుంచుకోవాలని సూచించారు.

చట్టసభల సభ్యుల ప్రవర్తన, చట్టసభల పనితీరుపైనా ప్రజాస్వామ్యంపై ప్రజల గౌరవం ఆధారపడి ఉంటుందన్న ఆయన, దురదృష్టవశాత్తూ, పలుచోట్ల సభలు జరుగుతున్న తీరు, ప్రజాప్రతినిధులు వ్యవహరిస్తున్న తీరుతో ప్రజల్లో గౌరవం తగ్గిపోతోందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సమస్యను వీలైనంత త్వరగా సరిదిద్ది ప్రజల్లో సభలు, సభ్యులపై నమ్మకాన్ని పున:ప్రతిష్టించాల్సిన అవసరముందని ఉపరాష్ట్రపతి పేర్కొన్నారు.

స్వయం సాధికారతను కాస్తంత పక్కనపెట్టి ప్రజల బాగోగులు, వారి సంక్షేమమే ప్రజాప్రతినిధుల ప్రథమ ప్రాధాన్యంగా స్వీకరించాలన్న ఉపరాష్ట్రపతి, ప్రజలకోసం సమయం వెచ్చించలేని వారు దయచేసి రాజకీయాల్లోకి, చట్టసభల్లోకి అడుగుపెట్టొద్దని తన ఆలోచనను ఉపరాష్ట్రపతి నొక్కి చెప్పారు.

ప్రజలతో మమేకమవుతూ, వారి సమస్యలను అర్థం చేసుకుని, వారి ఆకాంక్షలను సభల్లో ప్రతిబింబింజేస్తూ, సమస్యల పరిష్కారానికి కృషిచేయడం ద్వారా ప్రజల విశ్వాసాన్ని చూరగొనాలన్న ఆయన, మాటలతో మెప్పించి, ఒప్పించగల సమర్ధతతో పాటు నైతిక ప్రవర్తనను కూడా ప్రజాప్రతినిధులు కలిగి ఉండాలని సూచించారు. 

చట్టసభల్లోని వివిధ అంశాలపై సవివరణాత్మకంగా, సానుకూలంగా చర్చించడం, తుది నిర్ణయం తీసుకోవడం అత్యంత అవసరమన్న ఉపరాష్ట్రపతి, సభలో అనవసరంగా రాద్ధాంతం చేయడం ద్వారా సాధించేది ఏదీ ఉండదని తెలిపారు. ప్రభుత్వాలను అంశాలవారిగా విమర్శించడం, నిలదీయడం మంచిదేనన్న ఆయన, కేవలం రాజకీయ ప్రయోజనాలకోసం సభల్లో గందరగోళం సృష్టించడం ప్రజాస్వామ్య వ్యవస్థకు చేటు చేస్తుందని తెలిపారు. దీనిపై అన్ని పార్టీలూ ఆలోచించాలని దిశానిర్దేశం చేశారు.

సుదీర్ఘ పోరాటం తర్వాత విముక్తి పొంది, స్వతంత్ర రాష్ట్రంగా గోవా సాధిస్తున్న ప్రగతిని అభినందించిన ఉపరాష్ట్రపతి, దేశంలోనే అత్యంత ఎక్కువ తలసరి ఆదాయం కలిగిన రాష్ట్రంగా వృద్ధి చెందుతున్న విషయాన్ని ప్రస్తావించారు. ఈ సందర్భంగా గోవా ప్రజలకు, ప్రభుత్వాలకు అభినందనలు తెలియజేశారు.

అయితే, 1963లో మొదటి అసెంబ్లీ ఎన్నికలనుంచి నేటి వరకు 57 ఏళ్లలో దాదాపుగా 30 ప్రభుత్వాలు ఏర్పాటు కావడం పట్ల విచారం వ్యక్త చేసిన ఆయన, ఇటువంటి రాజకీయ పరిస్థితులను సమర్థించడం చాలా కష్టమని, ఇది ప్రతికూల అవగాహనకు దారితీస్తుందని అభిప్రాయపడ్డారు.

రాజకీయ స్థిరత్వం సాధించి ఉంటే గోవా మరింత మెరుగైన స్థితిలో ఉండేదన్న ఉపరాష్ట్రపతి, ఈ స్థిరత్వాన్ని ఇకనైనా సాధించేందుకు అన్ని భాగస్వామ్య పక్షాలు, మరీ ముఖ్యంగా శాసనసభ్యులు లోతుగా విశ్లేషించుకోవాలని ఆకాంక్షించారు.

దేశంలో ఉత్తమ రాష్ట్రంగా నిలవాలంటే ఈ సవాళ్లను పరిష్కరించుకుని ముందుకెళ్లాల్సిన అవసరం ఉందన్న ఆయన, ఈ 30 ప్రభుత్వాల్లో 11 ప్రభుత్వాలు ఏడాదికన్నా తక్కువ సమయం (ఆరు రోజులనుంచి 334 రోజుల వరకు) అధికారంలో ఉండటాన్ని కూడా ప్రస్తావించారు. కేవలం 3 ప్రభుత్వాలే ఐదేళ్ల పూర్తి సమయాన్ని పూర్తిచేయడం, ఐదుసార్లు (639 రోజులపాటు) రాష్ట్రపతి పాలనలో రాష్ట్రం ఉన్న విషయాలనూ ఆయన ఉటంకించారు.

గోవా అభివృద్ధిలో గనుల తవ్వకం పోషిస్తున్న పాత్రను ప్రస్తావించిన ఉపరాష్ట్రపతి, భూమి పరిమిత పరిమాణంలో అందుబాటులో ఉండటం కారణంగా.. పర్యావరణ సమస్యలను దృష్టిలో ఉంచుకుంటూ.. సుస్థిర ఆర్థికాభివృద్ధి దిశగా రాష్ట్రం పురోగమించాలని ఆకాంక్షించారు. సాంకేతిక పరిజ్ఞానం, జీవ సాంకేతిక పరిజ్ఞానం, అంకుర సంస్థల వంటి వాటిని ప్రోత్సహిస్తూ, మానవ వనరులకు అవసరమైన నైపుణ్యాన్ని అందిస్తూ మరింత ముందుకు దూసుకెళ్లాలని దిశానిర్దేశం చేశారు.

ఈ కార్యక్రమానికి గోవా గవర్నర్ భగత్ సింగ్ కోశ్యారీ, గోవా ముఖ్యమంత్రి డాక్టర్ ప్రమోద్ సావంత్, గోవా  శాసనసభాపతి రాజేశ్ పాట్నేకర్, శాసనసభ వ్యవహారాల మంత్రి మావిన్ గుదిన్హో, విపక్షనేత దిగంబర్ కామత్, వివిధ రంగాల ప్రతినిధులు, పాత్రికేయులు హాజరయ్యారు. ఈ సందర్భంగా సీనియర్ శాసనసభ్యులను, పాతతరం మాజీ శాసనసభ్యులను ఉపరాష్ట్రపతి సన్మానించారు.